ప్రతి రోజు లాలూ జైలు నుంచి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు: సొంత పార్టీ నాయకుని మాటలు వైరల్

బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ టార్గెట్‌గా రాష్ట్రంలో రోజూ ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతూ ఉన్నాయి. తన కార్యకర్తలతో, అభ్యర్థులతో జైలు నుంచి రోజూ మాట్లాడుతున్నారంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు లాలూ యాదవ్‌పై ఈ వ్యక్తుల ఆరోపణలపై ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ ఆధారాలు అడిగారు. అయితే అప్పుడు ఈ విషయం పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి ఇలాంటి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి ఈ ప్రకటన ప్రత్యర్థి శిబిరం నుంచి కాదు, ఆర్జేడీ నాయకుడి నుంచే రావడం విశేషం.
ఓ బహిరంగ సమావేశంలో ఆర్జేడీకి చెందిన కమలేష్ శర్మ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిరోజూ అతనితో ఫోన్లో మాట్లాడుతుంటాడు అంటూ గయాకు చెందిన ఆర్జేడీ నాయకుడు కమలేష్ శర్మ వీడియో వైరల్ అయ్యింది, అందులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచి రోజూ తనతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. కమలేష్ ప్రకారం, లాలూ పిలిచి రోజువారి ఎన్నికల ప్రోగ్రామ్‌ల గురించి అడుగుతున్నారు. లాలూ యాదవ్ ఫోన్ ద్వారా బయటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు అని చెప్పుకొచ్చారు.
లాలూ ప్రసాద్ యాదవ్‌పై పెద్ద విషయాన్ని బహిర్గతం చేసిన కమలేష్ శర్మ ఇటీవల ఆర్జేడీలో చేరారు. అంతకుముందు ఆయన జనతాదళ్ యునైటెడ్ (JDU)లో ఉన్నారు. అతను గయాలోని టెకారి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ స్వయంగా సెప్టెంబర్ 12 న గయాలో కమలేష్ శర్మను పార్టీలో చేర్చుకున్నారు.
పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడంటూ ఆర్జేడీ నాయకుడు బయటి ప్రపంచానికి బహిర్గతం చేసిన తరువాత రాజకీయాలు వేడెక్కాయి. లాలూ నేరస్థుడని, 420 అలవాట్లు ఎక్కువ అంటూ జేడీయూ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఉత్సాహంలో కొంతమంది ఏదైనా చెబుతారని ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ చెప్పారు. కమలేష్ శర్మ కూడా అలాగే అటువంటి మాటలు అన్నారని వ్యాఖ్యానించారు.