ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసుకుంటున్న బీజేపీ

అధికార కూటమి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందే గెలిచిన భావన కలిగించడమంటే లక్ష్యాలను చేరుకోవడంలో, వ్యూహాలను రచించడంలో, ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంలో ఎవరికీ అందని ఎత్తుల్లో నిలిచినట్టే అర్ధం.

ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసుకుంటున్న బీజేపీ

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024 : ఓ వ్యక్తికయినా.. ఓ సంస్థకయినా.. దేశానికి దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీలకయినా.. గెలుపును అలవాటుగా మార్చుకోవడం అంత తేలిక కాదు. భిన్న కులాలు, మతాలు, విభిన్న సంస్కృతులు, భావవైరుధ్యాలు, లెక్కకు మించిన పార్టీలు ఉన్న దేశంలో.. ఎన్నికల ఫలితాల్లో ఏకపార్టీగా అయినా, కూటమిగా అయినా సంపూర్ణ ఆధిపత్యం సాధించడం అంటే చరిత్ర తిరగరాయడమే. అధికార కూటమి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందే గెలిచిన భావన కలిగించడమంటే లక్ష్యాలను చేరుకోవడంలో, వ్యూహాలను రచించడంలో, ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంలో ఎవరికీ అందని ఎత్తుల్లో నిలిచినట్టే అర్ధం. అసలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి జైత్రయాత్రకు కారణమేంటి..? వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని మరీ ప్రభంజనం సృష్టించబోయే పరిస్థితులకు ఏఏ కారణాలున్నాయి?

రిఫార్మ్, ఫెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌
17వ లోక్‌సభ చిట్టచివరి సమావేశంలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ఓ మాట అన్నారు. తరాల నిరీక్షణకు తెరదించామని సగర్వంగా చెప్పగలమన్నారు. శతాబ్దాలుగా అనేక తరాలు ఎదురుచూస్తున్న అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. ఇవన్నీ చేసే సామర్థ్యం అందరికీ ఉండదని.. కొందరే వీటిని ధైర్యంగా ఎదుర్కోగలరని, మిగిలినవారంతా రణక్షేత్రం నుంచి పలాయనం చిత్తగిస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు. రిఫార్మ్, ఫెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌పై దృష్టిసారించి ఐదేళ్ల పాలన సాగించామని.. 17వ లోక్‌సభ గొప్ప మార్పులకు, నిర్ణయాలకు వేదికగా నిలిచిందని ప్రధాని అన్నారు.

ఊహించని మార్పులు
మోదీ చెప్పినట్టు 17వలోక్‌సభ నిజంగానే ఊహించని మార్పులకు వేదికయింది. ఎప్పటికీ జరగవేమో అనుకున్న అనేక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచింది. అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సుసాధ్యంగా మార్చివేసింది. 2014లోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ.. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే తన అజెండాను పూర్తిస్థాయిలో అమలుచేయడం బీజేపీ మొదలుపెట్టింది. కాకపోతే.. ఇందుకు అవసరమైన పరిస్థితులను మాత్రం 2019 నాటికే సృష్టించుకుంది. కూటమి రెండో సారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే.. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేసి.. తన హామీల అమలుదిశగా తొలి అడుగువేసింది.

ఇక అక్కడి నుంచి త్రిబుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ చట్టాలు, అయోధ్య రామాలయ నిర్మాణం, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు, బ్రిటిష్ కాలం నాటి శిక్షాచట్టాల కాలంలో భారతీయ న్యాయచట్టాలు, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మార్గం వంటివన్నీ బీజేపీ కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవే. అయోధ్య రామాలయం శతాబ్దాలుగా హిందువుల కల. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటివి దశాబ్దాలుగా అమలుకు నోచుకోని ఎన్నికల హామీ. మోదీ, అమిత్‌ షా స్వయంగా చెప్పినట్టు.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తరాల నిరీక్షణకు తెరదించినవే అన్నది అంగీకరించి తీరాల్సిన నిజం. బీజేపీ 2019లో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువసీట్లలో గెలుపొందడం వల్లే ఇవన్నీ జరిగాయన్నది కూడా నిజం.

బలమైన కూటమిగా ఎన్డీఏ
ఇప్పుడు దేశంలో అత్యంత బలమైన పార్టీ బీజేపీ. బలమైన కూటమి ఎన్డీఏ. ప్రస్తుతం పార్టీ పరంగా బీజేపీని, కూటమి పరంగా ఎన్డీఏను చూస్తే.. వాటికి ఎదురేలేదు.. వారి జైత్రయాత్రకు తిరుగేలేదు అనిపిస్తుంది. అయితే ఈ స్థితికి చేరడం బీజేపీకి అనుకున్నంత తేలిగ్గా ఏమీ సాధ్యం కాలేదు. ఉనికి చాటుకోవడానికి, అస్తిత్త్వాన్ని నిలుపుకోవడానికి, దేశంలో మెజార్టీ ప్రజల మెప్పు పొందడానికి బీజేపీ సుదీర్ఘకాలం పోరాడింది. ఎన్నో ఎదురుదెబ్బలు తింది. ఆటుపోట్లకు గురయింది. పతానవస్థకు చేరింది. దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీగా, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గెలుపు నల్లేరుమీద నడకలా సాగిపోతున్న తరుణంలో.. 543 స్థానాలున్న లోక్‌సభలో రెండు స్థానాల్లో గెలుపొందిన జాతీయపార్టీగా అప్రతిష్టా మూటకట్టుకుంది.

అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, ప్రజల ఆలోచనల్లో మార్పు, కాంగ్రెస్ చేసిన తప్పులు ఇలా ఏ కారణం వల్లయినా కానీ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఇక్కడే బీజేపీ అడుగులను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇన్ని ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు తిన్న పార్టీ ఓసారి అధికారంలోకి వస్తే ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. ఆ అధికారం నిలబెట్టుకోవడానికి ఎక్కడికక్కడ రాజీపడుతూ ఉంటుంది. కొత్త దారుల్లో నడవడానికి, సరికొత్తమార్గాలు వేయడానికి సందేహిస్తూ ఉంటుంది. కానీ బీజేపీ దీనికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించింది.

Also Read: మోదీ ధీమాకు కార‌ణం ఏంటి? బీజేపీకి గెలుపు నల్లేరు మీద నడకేనా?

1997లో, 1998లో, 1999లో వాజ్‌పేయ్ నేతృత్వంలోని NDA కూటమి అధికారంలోకి వచ్చింది. 2004లో అధికారం కోల్పోయింది. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చేనాటికి పరిస్థితులు మారాయి.. ప్రజల అనేక ఆశలు, ఆకాంక్షల భారం, ప్రపంచీకరణలో భారత్ ముద్ర అంతర్జాతీయ సమాజంపై బలంగా వేయాల్సిన అవసరం, దేశాన్ని కొత్త శకంలోకి నడిపించాల్సిన తరుణం అది. 1999లో వాజ్‌పేయిలా అందరి ఆమోదముద్ర ఉన్న నాయకుడు లేడు. హిందుత్వానికి ప్రతీకగా భావించే మోదీ ప్రధాని అయ్యారు. 2014నాటికి బీజేపీ పరిస్థితి అది. కానీ ఆ సందర్భంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎక్కడా రాజీ పడలేదు. మోదీ స్వయంగా చెప్పినట్టు.. అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని రణక్షేత్రాన్ని జయించింది. సరికొత్త చరిత్ర సృష్టించింది.

అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచి..
మనది సెక్యులర్ దేశం. హిందువులు మెజార్టీగా ఉన్నప్పటికీ మతాన్ని వ్యక్తిగతంగా నమ్మినప్పటికీ.. ఆ సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికలపై పాటించేందుకు కాంగ్రెస్ సహా గత ప్రధానులెవరూ ఇష్టపడేవారు కాదు. కానీ ప్రధాని హోదాలో మోదీ తొలిసారి అమెరికా వెళ్లినప్పుడు అగ్రరాజ్యమయినప్పటికీ.. ఆ దేశ విందులో పాల్గొనలేదు. దేవీనవరాత్రుల ఉపవాసదీక్షలో ఉన్న ప్రధాని.. ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టలేదు. కొబ్బరినీళ్లు తాగి విందుకు దూరంగా ఉన్నారు. వర్థమానదేశానికి చెందిన ఓ ప్రధాని.. అగ్రరాజ్య విందులో అలా తన మతాచారాలకు పెద్దపీట వేయడం అప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత.. భారత ప్రాచీన యోగా అంతర్జాతీయ యోగాదినోత్సవంగా మారడం దగ్గరి నుంచి అనేక విషయాల్లో భారతీయతకు పెద్దపీట వేసింది. విదేశాంగ విధానంలోనూ కాంగ్రెస్ పాలనావిధానాలను కొనసాగించడం కాకుండా.. బీజేపీ తనదైన నిర్ణయాలతో.. బలమైన భారత్ అన్న భావనను ప్రపంచానికి పెంపొందించింది. దేశీయంగా అజెండా అమలుతో చిరకాల లక్ష్యాలు సాధించడం, అంతర్జాతీయంగా భారత్‌ను కీలక స్థానంలో నిలబెట్టడం రెండూ గత ఎన్డీయే పదేళ్ల పాలనలో ముఖ్యంగా చివరి ఐదేళ్ల కాలంలో ఒకేసారి జరిగాయి.