Lok Sabha Elections 2024 : మోదీ ధీమాకు కారణం ఏంటి? బీజేపీకి గెలుపు నల్లేరు మీద నడకేనా?
ఎన్డీయే కూటమి 400కు పైగాస్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది రాజకీయవిశ్లేషకుల అంచనా.

Modi
Lok Sabha Elections 2024- BJP : దేశాన్ని సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, వెనకబడిన తరగతులకు దిక్సూచిగా మారడం, అవినీతిని సహించకపోవడం, యువత, మహిళల ఓట్లను ఆకర్షించడం, ప్రజలను పేదరికం నుంచి తొలగించే కార్యక్రమాలు నిష్పక్షపాతంగా అమలుచేయడం, ప్రచారంలో దూసుకుపోవడం వంటివి బీజేపీకి గెలుపుసూత్రాలుగా మారబోతున్నాయన్నది రాజకీయవిశ్లేషకుల అంచనా. ఎన్డీయే కూటమి 400కు పైగాస్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది వారి విశ్లేషణ.
దేశాన్ని రీఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ విధానంలో నడిపిస్తున్నామని, మార్పు దిశగా భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని పార్లమెంట్‌లో చెప్పారు. గత పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగిందన్నారు. ఇది నిజం. కరోనా అవాంతరాలను, రష్యాయుక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిస్థితులను తట్టుకుని మరీ ఒడిదుడుకులు లేని సుస్థిర ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్డడంలో ఎన్డీఏ ప్రభుత్వం అందరూ గుర్తించే విజయాలు సాధించింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదోఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే.. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని చెబుతున్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతామని అన్నివేదికలపై నుంచి హామీ ఇస్తున్నారు.
దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని చెబుతూ వారిని.. భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ పదేళ్ల పాలనను, గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనను పోల్చిచూపుతూ యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని తరచుగా 10 సంవత్సరాలు వర్సెస్ 70 సంవత్సరాలు అనే పదం వాడుతున్నారు. అంటే గత యూపీఏ పాలనే కాకుండా.. అంతకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మొత్తం కాలానికి తమ పదేళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తూ.. తాము సాధించిన విజయాలను, కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తున్నారు. ప్రధానిమోదీకి దీటుగా ప్రతిపక్షాలు ప్రచారం చేయలేకపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా ఎలా ఉంచగలమో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
యువ ఓటర్లలో బీజేపీకి ఆదరణ!
25కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తులను చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. మహిళలు, యువత, పేదలు, రైతులే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు.. వారందరినీ బీజేపీకి విశ్వాసం గల ఓటర్లుగా మార్చేశాయి. గరీబ్, కిసాన్, మహిళ, యువ ఓటర్లలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే ఉచితాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. జాతీయస్థాయిలో అనేక కార్యక్రమాలను కేంద్రం అమలుచేస్తోంది.
బీజేపీ గెలుపు యాత్రలో ఓబీసీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని ఓబీసీ వర్గానికి చెందిన నేత. దేశంలో 45 నుంచి 50శాతం ప్రజలు ఈ వర్గానికి చెందినవారే. ఉత్తరాది రాష్ట్రాల్లో వెనుకబడినవర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా బీజేపీ ఎదిగింది. 2009 నుంచి 2019కి మధ్య బీజేపీకి మద్దతిచ్చే ఓబీసీ వర్గాల ప్రజల సంఖ్య రెట్టింపయింది. 2009లో 23శాతంగా ఉంటే.. 2019లో 44శాతానికి చేరింది. కర్పూరీఠాకూర్‌కు భారతరత్న వెనక ఓబీసీల ఓట్లను మరింతగా రాబట్టడమనే వ్యూహం దాగి ఉంది.
దేశవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో నిత్యం జరుగుతున్న ఈడీ దాడుల ద్వారా అవినీతిని సహించబోమన్న సంకేతాన్ని ఎన్డీయే కూటమి ప్రజల్లోకి పంపిస్తోంది. దాడులు, అరెస్టులతో అవినీతి రహిత సమాజం అన్న సందేశం ప్రజల్లోకి వెళ్తోంది. 2014లో యూపీఏపై భారీ వ్యతిరేకతకు కారణం అవినీతి ఆరోపణలు. 2జీ స్కామ్, కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణం కాంగ్రెస్ ఓటమిని నిర్దేశించాయి. ఇప్పుడు ఎన్డీయే కూటమిపై అవినీతి ఆరోపణలు వినిపించడం లేదు.
PM Modi : గెలిచేందుకు మోదీ చెప్పిన ఫార్ములా ఇదే.. ఒంటరిగానే 370 సీట్లు వస్తాయట
కరోనా అనంతరం కాలంలో పొరుగు దేశాల ఆర్థికవ్యవస్థలు కుప్పకూలుతుంటే..భారత్ ఆర్థికంగా స్థిరంగా నిలబడడం, పదేళ్ల కాలంలో అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలు, పాకిస్థాన్, చైనాతో ఉద్రికత్తలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ రెండు దేశాలను కట్టడి చేయగలస్థితిలో భారత్ ఉండడం, రక్షణరంగం బలోపేతం వంటివి బీజేపీకి గెలుపును నల్లేరు మీద నడకలా మార్చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
వీటన్నింటితో పాటు బీజేపీ క్షేత్రస్థాయి నుంచి జాతీయస్థాయి దాకా ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా, ఉధృతంగా నిర్వహిస్తోంది. రాష్ట్రాల్లో పరిస్థితులను స్థానిక నేతలకు వదిలేయకుండా.. ప్రధాని మోదీ స్వయంగా ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు ఈ పదేళ్ల కాలంలో ఎన్నికలు జరిగిన ప్రతిరాష్ర్రంలోనూ, రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. ఇక బీజేపీ సోషల్ మీడియా ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ, బీజేపీని బలమైన శక్తిగా చూపించడంలోనూ బీజేపీ సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉంది. మొత్తంగా సరికొత్త ఎత్తుగడలు, అంతుచిక్కని వ్యూహాలు, రాజకీయ చతురుతతో బీజేపీ 2024 ఎన్నికల్లో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయింది.