4th Phase ఓట్ల పండుగ : పోలింగ్ ప్రారంభం

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 12:50 AM IST
4th Phase ఓట్ల పండుగ : పోలింగ్ ప్రారంభం

Updated On : April 29, 2019 / 12:50 AM IST

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ పోలింగ్‌తో మహారాష్ట్ర, ఒడిశాల్లో ఎన్నికలు పూర్తి కానున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 

లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 12 కోట్ల 79 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహారాష్ర్టలో 17, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 8, ఒడిశా 6, మధ్యప్రదేశ్ 6, బీహార్ 5, జార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్‌లో 1 నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది.

నాలుగో విడత పోలింగ్ లో భాగంగా మహారాష్ర్టలోని ఉత్తర ముంబయి, దక్షిణ ముంబయి, ఉత్తర మధ్య ముంబయి.. రాజస్థాన్‌లోని జలవర్ బరాన్, జోధ్‌పూర్, బాడ్మేర్.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్, కన్నౌజ్.. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్.. మధ్యప్రదేశ్‌లోని చింద్వాడ, సిధీ, జబల్‌పూర్, బిహార్‌లో దర్భంగా, బెగూసరాయ్ తదితర కీలక సెగ్మెంట్లలో ఎన్నికలు జరుగుతున్నాయి.

నాలుగో విడత ఎన్నికల్లో హేమాహేమీలు బరిలో ఉన్నారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సునీల్‌దత్ కూతురు ప్రియాదత్, బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్, బీజేపీ నేత పూనమ్ మహాజన్ ఎంపీలుగా పోటీచేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ నుంచి నామినేషన్ వేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ జోధ్‌పూర్‌ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు.

బీజేపీ సిట్టింగ్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్‌ తో వైభవ్ తలపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ నుంచి బీజేపీ లీడర్ బాబుల్ సుప్రియో పోటీలో ఉన్నారు. చింద్వాడ నుంచి మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కొడుకు నకుల్ పోటీ పడుతున్నారు. బీహార్‌లోని బెగూసరాయ్‌ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్, కన్హయ్య కుమార్ పోటీపై ఆసక్తి నెలకొంది. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకు ఈసీ ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు మూడు దశల్లో 303 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.