దేశవ్యాప్తంగా రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. ఓటింగ్ కి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గురువారం (ఏప్రిల్ 18,2019) కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం 97 స్థానాల్లో ఎన్నిక కోసం పోలింగ్ జరగాల్సి ఉన్నా డీఎంకే అభ్యర్థి నివాసంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడిందన్న కారణంతో తమిళనాడులోని వేలూరు ఎన్నికను రద్దు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా తూర్పు త్రిపుర స్థానంలో పోలింగ్‌ను ఏప్రిల్ 23కు ఈసీ వాయిదా వేసింది.
తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. కర్నాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్‌లోని 8 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అసోం, బీహార్, ఒడిషా రాష్ట్రాల్లో 5 చొప్పున లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుపుతారు. ఛత్తీస్‌ఘడ్, వెస్ట్ బెంగాల్‌లో 3 చొప్పున లోక్‌సభ సీట్లకు, జమ్మూ కాశ్మీర్‌లో 2, మణిపూర్, త్రిపుర, పాండిచ్చేరిలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగనుంది. లోక్‌సభతో పాటు ఒడిషా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 35 అసెంబ్లీ సీట్లకు 244 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. సీఎం నవీన్ పట్నాయక్ రెండు స్థానాల నుంచి బరిలో నిలిచారు. 244 మంది అభ్యర్థుల్లో అందరికన్నా రిచ్చెస్ట్ గా నవీన్ పట్నాయక్ నిలిచారు. నవీన్ ఆస్తులు రూ.63కోట్లు.
రెండో దశ ఎన్నికల్లో 1,644 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 427 మంది కోటీశ్వరులు పోటీ పడుతున్నారు. 27 శాతం అభ్యర్థులు రూ.కోటికిపైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. 11 శాతం మంది రూ.5 కోట్లపైన, 41 శాతం మంది అభ్యర్థులు రూ.10 లక్షల్లోపు ఆస్తులున్నట్లు చెప్పారు. ఈసారి 70 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి. మూడో విడత ఏప్రిల్ 23, నాలుగో విడత ఏప్రిల్ 29, అయిదో విడత మే 6, ఆరో విడత మే 12, ఏడో విడత పోలింగ్ మే 19న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది.