మతమార్పిడులకు పాల్పడితే జైలుకే..లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ కొత్త చట్టం

Dharma Swatantrya Bill-2020 : ‘లవ్ జిహాద్’ను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ధర్మ స్వాతంత్ర్య బిల్లు-2020ను ఆమోదించింది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో బిల్లుకు ఆమోదం తెలిపారు.
కొత్త బిల్లుతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మైనర్, మహిళలను బలవంతంగా మతం మార్చితే కనీసం రూ.50వేల జరిమానాతో పాటు పది సంవత్సరాలపాటు జైలు శిక్ష పడనుంది. కొత్త బిల్లు ప్రకారం.. ఒకరిపై మత మార్పిడి బలవంతం చేస్తే 1-5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధించనున్నట్లు హోమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.
ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ, అన్ని మతాలకు, కులాలకు చెందినది.. ఇందులో ఎలాంటి వివక్ష లేదని సీఎం అశోక్ చౌహాన్ పేర్కొన్నారు. గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేసిన మూడో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.