తండ్రి జయంతి రోజునే కాంగ్రెస్‌కు కొడుకు జ్యోతిరాదిత్య గుడ్ బై, మధ్యప్రదేశ్ ప్రభుత్వం పతనం?

కాంగ్రెస్ పార్టీకి జ్యతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రాజ్యసభసీట్ల కోసం మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో అంతర్గతపోరు సాగుతున్న సమయంలో అదునుచూసిఅమిత్ షా తీసిన దెబ్బ ఇది. సింధియాను తనవైపు తిప్పుకొన్నారు. ఆయనకు 17-20మంది వరకు ఎమ్మెల్యేల మద్దతుంది. ఇది చాలు కాంగ్రెస్ కుప్పకూలిపోవడానికి, బీజేపీ పీఠమెక్కడానికి. దీనికి బదులుగా రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి పదవిని సింధియా తీసుకోబోతున్నారన్నది బీజేపీ వర్గాల సమాచారం.
18ఏళ్ల పార్టీతో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకున్న సింధియా, సోనియాగాంధీకే రాజీనామా లేఖను పంపించారు. ముందుకెళ్లడానికి ఇదే సమయమన్నారు. చిత్రమేంటంటే, ఇదేరోజు ఆయన తండ్రి, కాంగ్రెస్ దిగ్గజం, మాజీ కేంద్రమంత్రి మాధవరావు సింధియా 75వ జయింతి. 1971 నుంచి ఆయన చనిపోయేవరకు ఓటమినెరగరు. 2001లో ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన్నుకాంగ్రెస్ మర్చిపోలేదు. జయంతి సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు నివాళి అర్పించారు. ఇదే రోజు ఆయన కొడుకు జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఏకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చబోతున్నారు.
కొన్నిగంటలకు ముందు, హోంమంత్రి అమిత్ షాతో కలసి ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు సింధియా. బీజేపీలో చేరే విషయమై చర్చించారు. ఆయనకు మద్దతున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అందుబాటులో లేరు. నిజానికి సింధియా గురించి రాష్ట్ర బీజేపీ నేతలకు, జాతీయ నేతలకు ముందుగా తెలియదు. ఇదంతా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదేన్‌తో కలసి అమిత్ షా పన్నిన వ్యూహం.
మధ్యప్రదేశ్ లో మూడురాజ్యసభ సీట్లున్నాయి. అందులో రెండింటిని కాంగ్రెస్ గెల్చుకొనేలా ఉంది. మారిన సమీకరణాలతో పరిస్థితి తల్లక్రిందులైంది. ఈరోజు సమావేశమైయ్యే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్ధులను ప్రకటించనుంది. సింధియాకు రాజ్యసభ టిక్కెట్ గ్యారంటీ.
మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 114 సీట్లున్నాయి. నాలుగు స్వతంత్ర సభ్యుల మద్దతుంది. ఎస్సీ, బీఎస్పీ సభ్యలూ కాంగ్రెస్ వెంటే ఉన్నారు. ఇక బీజపీకి ఉన్న బలం 109. రెండు సీట్లు ఖాళీ. సింధియా వెన్నుపోటు పొడవడంతో కాంగ్రెస్ అధికారం గల్లంతవ్వడం ఖాయం.
అందుకే, మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బుధవారం గవర్నర్‌ను కలసి కమల్‌నాధ్ ప్రభుత్వాన్ని బలాన్ని నిరూపించుకోమని కోరే అవకాశం ఉంది. 16నుంచి మొదలైయ్యే బడ్జెట్ సమావేశాల్లో బలనిరూపణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంకావాలి. అప్పుడే అధికారం మారే అవకాశమూ ఉంది.
See Also | ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు తొలగించాలి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం