‘మహా’మంత్రులపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్ నివేదికలో వెల్లడి

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలోని 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అడ్వకసీ గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) నివేదికలో వెల్లడైంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లలో ఇప్పుడు మంత్రులు అయినవారు సమర్పించిన క్రిమినల్ కేసుల వివరాలను ఏడీఆర్ విశ్లేషించింది. వారిలో 18 మంది మంత్రులపై తీవ్ర క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ నివేదికల్లో తేలింది. కాగా..మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ లో ఇప్పటివరకు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయక పోవడంతో ఆయనకు సంబంధించిన నేరాల వివరాలు లభించలేదు. కాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ లో 43మంది మంది మంత్రులు ఉన్నారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ పక్షాల మహా వికాస్ ఆఘాదీ సర్కారులో 42 మంది మంత్రుల్లో 41 మంది కోటీశ్వరులని తేలింది. మహారాష్ట్ర మంత్రుల్లో రూ.22 కోట్ల ఆస్తులున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది.
17 మంది మంత్రులు 25 నుంచి 50 ఏళ్ల వయసు లోపువారే ఉన్నారు. 25 మంది మంత్రుల వయసు 50 నుంచి 80 ఏళ్ల లోపు వయసు వారున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వజీత్ కదం అందరు మంత్రుల కంటే అత్యధికంగా రూ.217 కోట్ల ఆస్తులు, రూ.121 కోట్ల అప్పులున్నాయని చూపించారు. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ కు రూ.75 కోట్లు, రాజేష్ తోపీకి రూ.54కోట్ల ఆస్తులున్నాయని ఏడీఆర్ వెల్లడించింది.
మంత్రుల్లో 22 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మరో 18 మంది మంత్రులు 8 నుంచి 12 వతరగతి మాత్రమే చదివారని ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. కాగా..ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ లో మహిళ ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. 43మంది మంత్రుల్లో కేవలం ముగ్గురు మంది మాత్రమే మహిళలు ఉన్నారు.