Mamata on Mahua: మహువా మొయిత్రాపై మౌనం వీడిన మమత.. ఏం చెప్పారంటే?
బీజేపీ తన విజయావకాశాలను కోల్పోయింది. ప్రజలు క్షేత్రస్థాయిలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ మోడీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనిపిస్తుంది

Mamata on Mahua: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఆమె పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు మౌనం వీడారు. మహువాకు దీదీ మద్దతుగా నిలిచారు. మహువా మొయిత్రాను తొలగించడానికి బీజేపీ కుట్ర పన్నిందని మమతా బెనర్జీ ఆరోపించారు.
మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి తప్పించాలని బీజేపీ యోచిస్తోందని, ఎన్నికల ముందు ఆమె (మహువా మొయిత్రా) మరింత పాపులర్ కావడానికి ఇది దోహదపడుతుందని, పార్లమెంటులో మాట్లాడే ఆమె ఇప్పుడు బయట మాట్లాడుతుందని మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంలో బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని, కేవలం మూడు నెలలు మాత్రమే మోదీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ.. దేశంలో బ్యాంకింగ్ రంగం తిరోగమనంలో ఉందని మమత విమర్శలు గుప్పించారు.
మమత ఇంకా మాట్లాడుతూ.. “వాస్తవానికి, బీజేపీకి ఇది అలవాటుగా మారింది. వారు ఎవరి నుంచి ముప్పును చూస్తారో వారిని ఎలాగైనా అణచివేయాలని పని చేస్తారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. బీజేపీ తన విజయావకాశాలను కోల్పోయింది. ప్రజలు క్షేత్రస్థాయిలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ మోడీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనిపిస్తుంది’’ అని అన్నారు.