Jawan Rakeshwar Singh : జవాన్ రాకేశ్వర్ సింగ్ ఫొటో విడుదల చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన రాకేశ్వర్ సింగ్.. తమ అధీనంలో సురక్షితంగా ఉన్నట్లు ఫొటోలు విడుదల చేశారు. ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్నారు రాకేశ్వర్‌సింగ్.

Maoists Release Photo Of Jawan Rakeshwar Singh
Maoists release photo of Jawan Rakeshwar Singh : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన రాకేశ్వర్ సింగ్.. తమ అధీనంలో సురక్షితంగా ఉన్నట్లు ఫొటోలు విడుదల చేశారు. ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్నారు రాకేశ్వర్‌సింగ్. మధ్యవర్తులను ప్రకటిస్తే రాకేశ్వర్‌ను విడుదల చేస్తామని మావోయిస్టులు నిన్న ప్రకటన చేశారు. జవాన్ క్షేమంగా ఉన్నట్లు సాక్ష్యాలు చూపిస్తే మధ్యవర్తులను ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.
దీంతో ఇవాళ రాకేశ్వర్ ఫోటోను మావోయిస్టులు విడుదల చేశారు. జవాన్ రాకేశ్వర్ సింగ్ కోసం కుటుంబసభ్యులు కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. తన తండ్రిని మావోయిస్టులు సురక్షితంగా విడుదల చేయాలని ఇప్పటికే రాకేశ్వర్ సింగ్ కూతురు మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది.
తారెం దాడిపై నిన్న మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది. ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టుల డీకేఎస్ జెడ్ సీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దాడిలో 23 మంది సైనికులను చంపామని తెలిపారు. 2020 నుంచి ఇప్పటివరకు 150 మంది గ్రామస్తులను మావోయిస్టు ఇన్ ఫార్మర్ల నెపంతో పోలీసులు హత్య చేశారని తెలిపారు. తమ వద్ద బందీగా ఉన్న వారిని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు వెల్లడిస్తే..బందీలను అప్పగిస్తామని చెప్పారు. అప్పటివరకు తమ జనతన సర్కార్ లో క్షేమంగా ఉంటారని పేర్కొన్నారు. 2 వేల మంది పోలీసులు తమపై దాడికి వచ్చారని..పీఎల్జీఏను నిర్మూలించేందుకు పథకం వేశారని తెలిపారు. పోలీసులు తమకు శత్రువులు కాదని చెప్పారు. పాలకవర్గం తెచ్చిన యుద్ధంలో పోలీసులు బలిపశువులు కావొద్దన్నారు.
ప్రజలను, వనరులను, ప్రజాసంపదను కాపాడేందుకే ప్రతిదాడి చేయాల్సి వస్తోందని లేఖలో స్పష్టం చేశారు. దాడిలో 14 ఆయుధాలు, 2 వేల తూటాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మృతి చెందిన పోలీసు కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.