ఒక్కటే పోరాటం, ఒక్కటే సంకల్పం : రైతుల పోరాటం

ఒక్కటే పోరాటం, ఒక్కటే సంకల్పం : రైతుల పోరాటం

Updated On : January 25, 2021 / 8:28 AM IST

marching farmers tractor rally : ఒక్కటే పోరాటం.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఒక్కటే నినాదం.. రైతు చట్టాలను రద్దు చేయాలి. ఒక్కటే సంకల్పం.. నల్ల చట్టాలను పాతిపెట్టాలి. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హస్తినలో ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. వేలాది మంది మ‌హారాష్ట్ర రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కారు. అకుంఠిత దీక్షతో పాదయాత్రగా సాగుతున్నారు. నాసిక్‌ నుంచి ముంబై వరకు చేరుకుంటున్నారు.

ఆల్ ఇండియా కిసాన్‌ సభ నేతృత్వంలో జరుగుతున్న ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. ఆకలిదప్పులు లెక్కచేయక వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ముంబై వైపు సాగుతున్నారు. సోమవారం ముంబై ఆజాద్ మైదాన్‌లో రైతులతో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొననున్న రైతన్నలు.. ఆ తర్వాత రాజ్ భవన్ వరకూ భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తారు.

ఇటు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు షరతులతో కూడిన అనుమతులు రావడంతో రైతు సంఘాల నేతలు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీని 100 కిలోమీటర్ల మేర నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఢిల్లీ సరిహద్దులో ఉన్న సింఘు, టిక్రీ, ఘజియాబాద్‌లలో ఈ ర్యాలీ మొదలై ఢిల్లీ ప్రధాన రహదారుల్లో వంద కిలోమీటర్ల వరకు సాగనుంది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల ర్యాలీ రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ ర్యాలీలో మొత్తం దాదాపు 3 లక్షల ట్రాక్టర్లు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్‌, హర్యానాల నుంచి వేలాది ట్రాక్టర్లు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నాయి.

ట్రాక్టర్ల ర్యాలీని ఒకే రూట్‌లో కాకుండా విభిన్న మార్గాల్లో నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయితే రిపబ్లిక్‌డే సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని… వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ట్రాక్టర్‌ ర్యాలీ రూట్‌ మ్యాప్‌ ఇస్తే .. ఆ మార్గంలో బారికేడ్లను తొలగిస్తామని పోలీసు శాఖ తెలిపింది. మొత్తానికి దేశ వ్యాప్తంగా అన్నదాతలు కదం తొక్కుతుండటంతో రిపబ్లిక్ డే వేడుకల కన్నా.. రైతుల ఆందోళనలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.