Chhattisgarh Encounter: ఆరేళ్ల తరువాత కోలుకోలేని దెబ్బ.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో భారీ సంఖ్యలో మావోలు మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

ఛ‌త్తీస్‌గ‌ఢ్ అడవుల్లో తాజాగా చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయారు.

Chhattisgarh Encounter: ఆరేళ్ల తరువాత కోలుకోలేని దెబ్బ.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో భారీ సంఖ్యలో మావోలు మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Chhattisgarh Encounter

Updated On : October 5, 2024 / 11:27 AM IST

Chhattisgarh Encounter: దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ మరోమారు నెత్తురోడింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ ఎదురుకాల్పుల్లో మావోల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎన్ కౌంటర్ లో 40మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. ఇప్పటికే 32 మంది మావోల మృతదేహాలను జవాన్లు స్వాదీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతనితోపాటు మరికొందరు మావోయిస్టు కీలక సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : భారీ ఎన్‌కౌంటర్‌.. 30 మంది మావోయిస్టుల మృతి

నెందూర్, తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో.. ఆపరేషన్ కగార్ పేరుతో అడవిలోకి బలగాలు ప్రవేశించాయి. రంగంలోకి డీఆర్జీ, ఎస్టీఎప్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ 1,200 మందితో ఆపరేషన్ ను మొదలు పెట్టారు. ఎదురుపడిన మావోలు, పోలీస్ బలగాల మధ్య భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ అడవుల్లో తాజాగా చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మావోలతోపాటు గ్రామస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. 2018 తరువాత అంటే సుమారు ఆరేళ్ల తరువాత మావోలపై జరిపిన అతిపెద్ద ఎన్ కౌంటర్ ఇదే. ఎన్ కౌంటర్ ప్రదేశంలో భారీగా ఆయుధాలు ఎస్ఎల్ఆర్, ఏకే 47లను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్, తెలంగాణ సరిహద్దులతోపాటు ఏవోబీ.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ , మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. నిఘాను పెంచిన పోలీసులు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.

 

తాజా ఎన్ కౌంటర్ పై ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ స్పందించారు. ఇదో పెద్ద ఆపరేషన్ అని, జవాన్లను అభినందించారు. నక్సలిజం తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలో నక్సలిజం తరిమికొట్టడం ఖాయమని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొమ్మిది నెలల్లో రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలని సంకల్పించారని సీఎం విష్ణుదేవ్ పేర్కొన్నారు.