BSP Chief Mayawati: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పొత్తు ఎవరితో ఉంటుందో తేల్చి చెప్పిన మాయావతి
వ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆదాయ నష్టం, అధ్వాన్నమైన రోడ్లు, శాంతిభద్రతలు, ఆరోగ్య సమస్యలు వంటి బర్నింగ్ సమస్యలు ఖచ్చితంగా హృదయాలను తాకుతుందని, వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన సమస్యగా మారే అవకాశం గురించి ఆమె అన్నారు.

2024 Elections: విపక్షాల ఇండియా కూటమిలో బహుజన్ సమాజ్ పార్టీ చేరబోతోందని కొద్ది రోజులుగా ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చాలా రోజుల క్రితమే తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని మాయావతి ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా విపక్షాల కూటమితో చేతులు కలుపుతారనే చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాలపై ఆదివారం మాయావతి స్పష్టతనిచ్చారు. క్రితం చెప్పినట్టుగానే తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్న కూటముల్లో చేరడం లేదని స్పష్టం చేశారు. ఆ రెండు కూటములకు (ఎన్డీయే, ఇండియా) సమదూరం పాటిస్తామని, ఆ రెండు పార్టీల విధానాలు ఒకటేనని మాయావతి విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా చెప్తూ ప్రతిపక్ష పార్టీలు ఇండియా అలయన్స్ పేరుతో కొత్త ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చెందిన అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ భాగస్వామిగా ఉంది. మాయావతి ప్రతిపక్ష పార్టీల్లో చేరడంపై ఊహాగానాలు వచ్చాయి. అధికార పార్టీ ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి కూడా మాయావతిపై అంచనాలు పెట్టుకుంది. కానీ రెండింటిపై మాయావతి నీళ్లు చల్లి, తాము ఈ రెండు కూటములకు దూరమని మరోసారి స్పష్టం చేశారు.
పోటీ ఒంటరిగానే
లోక్‌సభ ఎన్నికల సన్నాహకాల కోసం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశం అనంతరం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బీఎస్పీ రెండు కూటములకు దూరంగా ఉండి లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. పొత్తుకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయని, వాటి పట్ట జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలను మాయావతి హెచ్చరించారు. బీఎస్పీ వ్యతిరేక శక్తులు ఆ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా ప్రయోజనాలు, సంక్షేమంపై బీజేపీ, కాంగ్రెస్‌ల వైఖరి ఒకటేనని ఆమె అన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆదాయ నష్టం, అధ్వాన్నమైన రోడ్లు, శాంతిభద్రతలు, ఆరోగ్య సమస్యలు వంటి బర్నింగ్ సమస్యలు ఖచ్చితంగా హృదయాలను తాకుతుందని, వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన సమస్యగా మారే అవకాశం గురించి ఆమె అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌పై మాయావతి ఏం చెప్పారు?
ప్రజా సంక్షేమం, ప్రజాప్రయోజనాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ల వైఖరి దాదాపు ఒకే విధంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్ హక్కులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మాయావతి ఆరోపించారు. అటువంటి పరిస్థితిలో, నిరుద్యోగాన్ని తొలగించడానికి రిజర్వేషన్లు ఒక కారణం కాకూడదని అన్నారు. కులతత్వంపై ఆధారపడిన ఆర్థిక దోపిడీ, అన్యాయం, అసమానతలపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో, ప్రభుత్వంలో అసమాన ఉద్దేశాలు, విధానాలు కొనసాగితే తప్ప ప్రజలకు నిజమైన రిజర్వేషన్ ప్రయోజనాలు అందవని అన్నారు. ఈ సమావేశంలో మాయావతి బుల్డోజర్ల చర్యపై కూడా ప్రశ్నలు సంధించారు. ఒక వ్యక్తికి శిక్ష ప్రకటించకముందే కుటుంబ సభ్యులందరినీ శిక్షించడం తీవ్ర ప్రజా వ్యతిరేక చర్య అని అన్నారు. దీంతో జనజీవనం అస్తవ్యస్తమై ప్రజల ఇబ్బందులు తీవ్రమవుతున్నాయని మాయావతి అన్నారు.
ఇప్పటికే కొన్ని పార్టీలతో పొత్తు
ఇకపోతే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కూటములకు సమదూరం పాటిస్తామని ప్రకటించిన ఆమె.. ఈ రెండు కూటముల్లో లేని పార్టీలతో పొత్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో అకాలీదళ్ పార్టీతో హర్యానా రాష్ట్రంలో ఇండియన్ లోక్ దళ్ పార్టీతో ఆ పార్టీకి అధికారిక పొత్తు కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితమే కేసీఆర్, జగన్, మాయావతిలతో పొత్తు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు తెంచుకుంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలలోపు బీఎస్పీ నేతృత్వంలో మూడో కూటమి ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి.