సారూ.. ఈ వయసులో బ్యాటింగ్ అవసరమా? బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

బ్యాటు చూడగానే ఆయనలో ఉత్సాహం పొంగుకొచ్చిందో మరో కారణమో తెలియదు కానీ.. నేనూ బ్యాటింగ్ చేస్తా అంటూ బ్యాట్ అందుకున్నారు.

సారూ.. ఈ వయసులో బ్యాటింగ్ అవసరమా? బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

MLA Injured While Playing Cricket (Photo : Google)

Viral Video : ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎంతో అనుభవపూర్వకంగా ఈ సూక్తి చెప్పి ఉంటారు. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. వయసు మీద పడ్డాక కొన్ని పనులకు దూరంగా ఉండాల్సిందే. లేదంటే.. బొక్కబోర్లా పడటం ఖాయం.. మూతి ముక్కు పగలటం కూడా ఖాయమే. ఓ సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్యే విషయంలో అచ్చం ఇదే జరిగింది.

ఆ ఎమ్మెల్యే వయసు 72ఏళ్లు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించేందుకు వెళ్లారు. ఆ పెద్దాయన వచ్చిన పని చూసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయుంటే బాగుండేది. అయితే, బ్యాటు చూడగానే ఆయనలో ఉత్సాహం పొంగుకొచ్చిందో తనలో దాగున్న క్రికెటర్ బయటకు వచ్చాడో.. తెలియదు కానీ.. నేనూ బ్యాటింగ్ చేస్తా అంటూ బ్యాట్ అందుకున్నారు. అసలే ఎమ్మెల్యే సార్.. పైగా పెద్దాయన. అని భయపడుకుంటూ బౌలర్ బంతిని నెమ్మదిగా వేశాడు. ఆ బాల్ ను కొట్టేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే.. బొక్కబోర్లా పడ్డారు. ఈ క్రమంలో ఆయన గాయపడ్డారు కూడా. బ్యాట్ తో బంతిని కొట్టే ప్రయత్నంలో కాస్త ముందుకు వచ్చిన ఆయన.. అదుపు చేసుకోలేకపోయారు. బ్యాలెన్స్ కోల్పోయి దబ్ మని ముందుకు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన ఒడిశాలో జరిగింది. నార్ల నియోజకవర్గం కలహండిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. దీన్ని ప్రారంభించేందుకు బీజేడీ నేత, నార్ల ఎమ్మెల్యే భూపిందర్ సింగ్ వచ్చారు. టోర్నమెంట్ ను ప్రారంభించేసి వెళ్లిపోయి ఉంటే బాగుండేది. అలా కాకుండా బ్యాటింగ్ చేయాలని చూసి గాయాలపాలయ్యారు ఎమ్మెల్యే సారు. బౌలర్ బాల్ ని స్లో గా వేశాడు. దాన్ని ఆడే క్రమంలో ఆయన బ్యాలెన్స్ కోల్పోయారు. అంతే ముందుకు పడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే తలకు గాయమైంది. వెంటనే ఎమ్మెల్యే సారుని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

బ్యాటింగ్ చేసే క్రమంలో ఎమ్మెల్యే సారు ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. వార్నీ.. ఇలా జరిగిందేంటి? అని కంగుతిన్నారు. వెంటనే అంతా కలిసి ఎమ్మెల్యేని పైకి లేపారు. ఆయన తలకు గాయం కావడాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్న చిన్న గాయాలు మినహా.. పెద్దాయనకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ఈ వయసులో మీకు బ్యాటింగ్ అవసరమా? సారూ.. అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా అడుగుతున్నారు.