వింత వ్యాధితో 13 మంది మృతి.. ఏం జరుగుతోంది? 

బాధితులు ఛాతీ నొప్పితో పాటు దగ్గు, అలసటతో బాధపడుతున్నారు.

వింత వ్యాధితో 13 మంది మృతి.. ఏం జరుగుతోంది? 

Updated On : March 6, 2025 / 2:55 PM IST

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని ఒక మారుమూల గ్రామం ధనికోర్టలో నెల రోజుల వ్యవధిలో వింత వ్యాధితో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికులు భయంగుప్పిట బతుకుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యాధితో బాధపడుతున్న వారు మరో 80 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యాధి లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌లకు పంపించినట్లు అధికారులు చెప్పారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. బాధితులు ఛాతీ నొప్పితో పాటు దగ్గు, అలసటతో బాధపడుతున్నారు.

జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో వింత వ్యాధి ప్రబలుతుందని తెలిసిన వెంటనే అధికారులు ఆరోగ్య బృందాన్ని పంపారు. బాధితులందరూ మరణానికి ముందు ఛాతీ నొప్పి, దగ్గుతో బాధపడ్డారని అధికారులు తెలుసుకున్నారు.

ఒడిశా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ చిన్న గ్రామంలో దాదాపు ప్రతి ఇంటిలోనూ ఒకరు వ్యాధి బారిన పడ్డారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఐదుగురు మృతి చెందినట్లు మాత్ర తమకు తెలిసిందని సుక్మా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్
తెలిపారు.

తమ ఆరోగ్య బృందాలు కనుగొన్న కారణాల ప్రకారం.. వాతావరణంలో మార్పు, గ్రామస్థులు అడవుల్లోకి వెళ్లి రోజంతా మహువాను సేకరిండం వంటివి వ్యాధి కారణమని అనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో డీహైడ్రేషన్ కి దారితీస్తోందని అన్నారు. దీంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. మహువాను సేకరించడానికి అడవులకు వెళ్లాలనుకుంటున్న గ్రామస్థులకు ఓఆర్‌ఎస్‌ ఇస్తున్నట్లు కశ్యప్ చెప్పారు.