జాతీయ భద్రతే మాకు ముఖ్యం–నిర్మలాసీతారామన్

ఢిల్లీ: బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూకూర్చోమని ఆమె శుక్రవారం పార్లమెంట్లో రాఫెల్ డీల్ పై జరిగిన చర్చలో ఘాటుగా స్పందించారు.
పాకిస్తాన్,చైనాలు రక్షణ సంబంధ అంశాల్లో దూకుడుగా దూసుకపోతుంటే, అప్పటి యూపీఏ ప్రభుత్వ కేవలం 18 రఫేల్ యుధ్ధ విమానాల కొనుగోలుకు ప్రయత్నించిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్యను 36కు పెంచామని ఆమె చెప్పారు. యూపీఏ హాయంలో లాగా తమకు 10 ఏళ్లు పట్టలేదని కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒప్పందాన్ని పూర్తి చేశామని ఆమె తెలిపారు. 2016 సెప్టెంబర్ 23 నాటి ఒప్పందం మేరకు భారత్ కొనుగోలు చేసిన తొలి రఫేల్ యుధ్ధవిమానం సెప్టెంబర్లో ఇండియాకు వస్తుందని, మిగిలిన విమానాలు 2022కి అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
రఫేల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, అంబానీల కొసమే రాఫెల్ కొనుగోలు చేశామని కాంగ్రెస్ భావిస్తే, ఖత్రోచి, రాబర్ట్ వాద్రాల కోసమే యూపీఏ హయాంలో రాఫెల్ ఒప్పందాలు జరిగాయని ఆమె ఆరోపించారు. మేము చెప్పేమాటలు వినటానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓపిక లేదని ఎందుకంటే వారికి నిజాలు వినటం ఇష్టం లేదని ఆమె అన్నారు. దేశంలో యుధ్దవిమానాల తయారీ హెచ్ఏఎల్ను కాదని విదేశాలకు ఎందుకిచ్చారని ? ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ…. హెచ్ఎఎల్ పనితనం విషయమే కాదు, లోపాలు కూడా రాహుల్ తెలుసుకోవాలని ….తేజస్ విషయంలో హెచ్ఎఎల్ పనితనంలో వెనుక బడిందని, 43 ఆర్డర్ ఇస్తే, 8 విమానాలు మాత్రమే సమకూర్చారని ఆమె వివరించారు.