Nawab Malik : దావూద్ గ్యాంగ్ తో మంత్రి మాలిక్ కు సంబంధాలు..ఫడ్నవీస్ కు నవాబ్ ఘాటు రిప్లై

బాలీవుడ్‌ స్టార్‌హీరో షారూఖ్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను టార్గెట్‌ చేసిన మహారాష్ట్ర మంత్రి

Nawab Malik : దావూద్ గ్యాంగ్ తో మంత్రి మాలిక్ కు సంబంధాలు..ఫడ్నవీస్ కు నవాబ్ ఘాటు రిప్లై

Nawab

Updated On : November 9, 2021 / 5:32 PM IST

Nawab Malik బాలీవుడ్‌ స్టార్‌హీరో షారూఖ్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను టార్గెట్‌ చేసిన మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌పై మరోసారి తీవ్ర విమర‍్శలకు దిగారు దేవేంద్ర ఫడ్నవిస్. నవాబ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు దావూద్‌ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

అండర్‌వరల్డ్ క్రిమినల్స్‌తో నవాబ్ మాలిక్‌ కు సన్నిహిత సంబంధాలున్నాయని.. దీపావళి తర్వాత ఆధారాలు బయటపెడతానని మాజీ సీఎం ఫడ్నవీస్ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఫడ్నవీస్ ముంబైలో బీజేపీ ప్రధానకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న‌వారి నుంచి మంత్రి న‌వాబ్ మాలిక్ గ‌తంలో భూమి కొనుగోలు చేసిన‌ట్లు ఆరోపించారు. బాంబు పేలుళ్ల నిందితుడు స‌ర్దార్ షావాలీ ఖాన్‌, మొహమ్మద్ స‌లీమ్ ఇషాక్ ప‌టేల్ నుంచి భూమి కొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి హ‌సీనా పార్క‌ర్‌తో ఆ ఇద్ద‌రికీ లింకులు ఉన్న‌ట్లు ఫ‌డ్న‌వీస్ చెప్పారు.

ఫడ్నవీస్ మాట్లాడుతూ…”కుర్లాలోని ఎల్‌బీఎస్ మార్గ్‌లో ఉన్న 2.80 ఎక‌రాల స్థ‌లాన్ని సోలిడ‌స్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కేవ‌లం రూ. 30 ల‌క్ష‌లకు కొనుగోలు చేసింది. ఈ ప్లాట్‌ను ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి అత్యంత చవకగా రూ. 30 లక్షలకు కొనుగోలు చేశారు, రూ. 20 లక్షలు మాత్రమే చెల్లించారు. ఈ కొనుగోలు ఆ ఒప్పందంపై న‌వాబ్ మాలిక్ కుమారుడు ఫ‌రాజ్ మాలిక్ సంత‌కం చేశార‌ు. ఇది నవాబ్ మాలిక్ కుటుంబానికి చెందిన కంపెనీ. ఆ కంపెనీలో న‌వాబ్ కీల‌క పోస్టులో ఉండేవాడు, కానీ మంత్రి ప‌ద‌వి స్వీక‌రించ‌డానికి ముందు దానికి మాలిక్ రాజీనామా చేశారు. సలీం పటేల్ ఎవరో మీకు తెలియదా?. ఖైదీల నుంచి ఎందుకు భూమి కొనుగోలు చేశారు? మరి ఎల్‌బీఎస్‌ రోడ్డులోని మూడు ఎకరాల ప్లాట్‌ను రూ. 30 లక్షలకు ఎందుకు అమ్మారు? ఆర్డీఎక్స్ తెచ్చిన వారు, పేలుళ్లకు కుట్ర పన్నిన వారితో వ్యాపారం చేస్తున్నారా? నేను వీటన్నింటిని సమర్థ అధికారులకు పంపుతాను.. శరద్ పవార్‌కి కూడా పంపుతాను.. తద్వారా ఆ మంత్రి ఏమి చేశారో అతనికి తెలుస్తుంది” అని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.

సలీమ్ పటేల్ అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీమ్ అనుచరుడు. అంతేకాకుండా, దావూద్ సోదరి హసీనా పర్కార్‌ కారు డ్రైవర్ కూడా. దావూద్ దేశం విడిచి పారిపోయిన తర్వాత సలీమ్ పాటేల్ ద్వారా ఆ ఆస్తులను హసీనా పార్కర్ స్వాధీనం చేసుకుంది.

మరోవైపు, తనపై సంచలన ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అదే స్తాయిలో కౌంటర్‌ ఇచ్చారు మంత్రి నవాబ్‌మాలిక్‌. ఫడ్నవీస్ ఆరోపణల నేపథ్యంలో ఓ వీడియోను ట్విట్టర్ లో రిలీజ్ చేసిన మాలిక్.. రేపు (బుధవారం) హైడ్రోజన్‌ బాంబు వేస్తా.. డీ-గ్యాంగ్‌తో ఫడ్నవీస్ కి ఉన్న అండర్ వరల్డ్ లింకులను తానూ బయటపెడతానన్నారు. ఫడ్నవిస్‌ తాజా ఆరోపణలపై విచారణకు తాను సిద్ధమేనంటూ మంత్రి మాలిక్ ప్రతిసవాల్‌ విసిరారు.

ALSO READ Chennai Rains: చెన్నైను ముంచెత్తిన వరదలు… ఆ రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు.. రెడ్ అలర్ట్!