ధారావిలోని 7.5లక్షల మందికి కరోనా టెస్ట్ లు

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు.
అయితే రాబోయే 10-12రోజుల్లో దాదాపు 7.5లక్షల మంది ధారావి వాసులకు కరోనా టెస్ట్ లు చేయనున్నట్లు గురువారం(ఏప్రిల్-9,2020)బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) తెలిపింది. 150 మంది ప్రైవేట్ డాక్టర్ల సాయాన్ని కూడా ఈ భారీ ఎక్సర్ సైజ్ లో బీఎంసీ తీసుకోనుంది.
భారత్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం 1135 కరోనా కేసులు నమోదుకాగా,72మరణాలు నమోదయ్యయి. దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5865 కరోనా కేసులు నమోదు కాగా,169మరణాలు నమోదయ్యాయి.