Twitter To Delhi High Court : గ్రీవెన్స్ అధికారి నియామకానికి 8 వారాల సమయం కోరిన ట్విట్టర్

భారత్ లో గ్రీవెన్స్ ఆఫీస‌ర్‌ను నియమించేందుకు 8 వారాల సమయం కావాలని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్...ఢిల్లీ హైకోర్టుని కోరింది.

Twitter To Delhi High Court : గ్రీవెన్స్ అధికారి నియామకానికి 8 వారాల సమయం కోరిన ట్విట్టర్

Twitter

Updated On : July 8, 2021 / 3:46 PM IST

Twitter To Delhi High Court భారత్ లో గ్రీవెన్స్ ఆఫీస‌ర్‌ను నియమించేందుకు 8 వారాల సమయం కావాలని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్…ఢిల్లీ హైకోర్టుని కోరింది. రెండు రోజుల క్రితం స్థానిక వ్యక్తినే తాత్కాలిక చీఫ్ కంప్లెయిన్స్ ఆఫీసర్‌ గా నియమించినట్లు ట్విట్టర్ కోర్టుకి తెలిపింది. జులై 11 లోగా తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిని నిమమిస్తామని,రెండు వారాల్లోగా తాత్కాలిక నోడల్ కాంటాక్ట్ అధికారిని నియమిస్తామని ట్విట్టర్ కోర్టుకి తెలిపింది.

ఎనిమిది వారాల్లోగా మూడు పూర్తికాల స్థానాలకు(- చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ మరియు నోడల్ కాంటాక్ట్ పర్సన్)నియామకాలు చేయనున్నట్లు ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టుకి సృష్టం చేసింది. కాగా, నూతన ఐటీ రూల్స్ పాటించ‌డం లేద‌ని ఢిల్లీ హైకోర్టు హెచ్చ‌రించిన రెండు రోజుల త‌ర్వాత ట్విట్ట‌ర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఐటీ నిబంధనలను ట్విట్టర్ పాటించడం లేదని,కొత్త ఐటీ రూల్స్ ప్రకారం ట్విట్టర్ భారత్ లో వెంటనే ఓ గ్రీవెన్స్ అధికారిని నియమించాలని కోరుతూ న్యాయవాది అమిత్ ఆచార్య ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణలో భాగంగా ట్విట్టర్ ఈ మేరకు కోర్టుకి తెలిపింది.

కాగా, మే- 25 నుంచి సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌కు సంబంధించిన ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఇంట‌ర్మీడియేటరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిట‌ల్ మీడియా ఎథిక్స్ కోడ్‌) రూల్స్-2021 అమ‌లులోకి వ‌చ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 50 ల‌క్ష‌ల మందికి పైగా యూజ‌ర్లు గ‌ల అన్ని సోష‌ల్ మీడియా కంపెనీలు..ఆయా సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో వ‌చ్చే పోస్టుల‌పై ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి గ్రీవియెన్స్ అధికారిని నియ‌మించాల్సి ఉంటుంది. పెద్ద సోషల్ మీడియా కంపెనీలు.. చీఫ్ కంప్లెయిన్ ఆఫీసర్,నోడల్ అధికారి, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించడం తప్పనిసరి. అయితే వీరందరూ భారతీయులై ఉండాలి.

కొత్త రూల్స్ అమలు విషయంలో మొదట్లో ట్విట్టర్ మీన మేషాలు లెక్కించింది. దీంతో భారత ఐటీ నిబంధ‌న‌ల అమ‌లుకు క‌ట్టుబ‌డి ఉన్నారా? లేదా? అన్న విష‌య‌మై గత నెల ఐదో తేదీన ట్విట్ట‌ర్‌కు కేంద్రం చివ‌రి నోటీసు జారీ చేసింది. దీంతో ట్విట్ట‌ర్.. ధ‌ర్మేంద్ర చతూర్‌ అనే స్థానిక వ్యక్తిని తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా నియ‌మించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి-ట్విట్టర్‌కు మధ్య వైరం కొనసాగుతున్న నేపథ్యంలో కొద్ది రోజులకే చతూర్ తన పదవి నుంచి వైదొలిగారు. చతూర్ తప్పుకున్న గంటల వ్యవధిలోనే ట్విట్టర్.. సంస్థ గ్లోబ‌ల్ లీగ‌ల్ పాల‌సీ డైరెక్ట‌ర్‌గా ఉన్న జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా ట్విట్టర్ నియమించింది. అయితే, కొత్త ఐటీ రూల్స్ ప్రకారం..గ్రీవెన్స్ అధికారి భారతదేశ నివాసి అయి ఉండాలి. దీంతో జెరెమి కెస్సెల్‌ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేదు.

మరోవైపు, చతూర్ రాజీనామా చేసిన తరువాత కొత్త గ్రీవెన్స్ అధికారిని ఎందుకు నియమించలేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ట్విట్టర్‌ను ప్రశ్నించింది. దీనికి ఒక రోజు ముందు.. నిబంధనలను పాటించనందుకు మూడవ పార్టీ కంటెంట్‌పై చర్య తీసుకోవటానికి ట్విట్టర్ తన లీగల్ ఇమ్యునిటీని కోల్పోతుందని కేంద్రం కోర్టుకు తెలిపింది