NEET PG Counselling : జనవరి-12 నుంచి నీట్ పీజీ కౌన్సిల్సింగ్
వైద్య విద్య పీజీ ప్రవేశాలకు సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్

Students
NEET PG Counselling : వైద్య విద్య పీజీ ప్రవేశాలకు సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 2021-2022 ఏడాది మెడికల్ అడ్మిషన్ల కోసం నీట్-పీజీ కౌన్సిలింగ్ జనవరి 12న ప్రారంభమవుతాయని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవియా ఆదివారం ఓ ట్వీట్ లో తెలిపారు. “నీట్-పీజీ కౌన్సిలింగ్‌ను సుప్రీంకోర్టు ఆదేశాలు, రెసిడెంట్ డాక్టర్లకు ఆరోగ్య శాఖ ఇచ్చిన హామీ మేరకు జనవరి 12 నుంచి ఎంసీసీ ప్రారంభించనుంది. తాజా నిర్ణయంతో కోవిడ్‌పై సమర్ధవంతమైన పోరాటానికి మరింత బలం చేకూరనుంది. అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్‌లో తెలిపారు.
అసలు వివాదం ఏంటీ
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్ పీజీ ఆల్‌ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS)లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతేడాది జులై 29న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నోటిషికేషన్ జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీజీ మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా నీట్ పీజీలో రిజర్వేషన్లు కేటాయించారని, దీనివల్ల జనరల్ కేటగిరీ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి మైనార్టీలుగా మిగిలిపోతారని పిటిషనర్లు ఆరోపించారు.
దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతుండగానే..అక్టోబర్-25,2021 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కేంద్రం ప్రకటించింది. దీంతో పిటిషనర్లు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. రిజర్వేషన్ల చెల్లుబాటుపై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు కౌన్సెలింగ్ చేపట్టబోమని కేంద్రం కూడా హామీ ఇచ్చింది. 2021-22 ఏడాది నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ ఈనెల 7వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం అత్యవసరమని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్య సీట్లలో.. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సబబే అని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో మాదిరిగానే క్రిమిలేయర్ సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్‌లో 10 శాతం రిజర్వేషన్ కొనసాగనుంది.
ALSO READ Rajendra Prasad: నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కి కరోనా పాజిటివ్