అబద్ధాలు, మోసాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి: మోదీ

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో కూడా ప్రజలు బీజేపీకి గట్టి మద్దతునిచ్చారని తెలిపారు.

అబద్ధాలు, మోసాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి: మోదీ

Updated On : November 23, 2024 / 8:56 PM IST

మహారాష్ట్రలో మహాయుతి కూటమి 236 సీట్లు గెలుచుకుని, అఖండ విజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మోదీ ప్రసంగించారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలన, సామాజిక న్యాయం విజయం సాధించాయని.. అబద్ధాలు, మోసాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. అభివృద్ధికే ప్రజలు పట్టం గట్టారని, ప్రతికూల ధోరణితో చేసే రాజీకీయాలు ఓడిపోయాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను రూపుదిద్దాలన్న సంకల్పాన్ని మహారాష్ట్ర బలపరిచిందని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ, ఎన్డీఏ కార్యకర్తలందరికీ అభినందనలు తెలుపుతున్నానని మోదీ చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే కాకుండా ఇవాళ చాలా రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో ప్రజలు బీజేపీకి గట్టి మద్దతునిచ్చారని తెలిపారు.

అసోం ప్రజలు బీజేపీపై తమ విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ విజయం సాధించామని చెప్పారు. బిహార్‌లో ఎన్డీఏకు మద్దతు పెరిగిందని, దేశం ఇప్పుడు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటోందని దీన్నిబట్టి తెలుస్తోందని తెలిపారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..