నిర్లక్ష్య ఫలితమేనా : ఉగ్రదాడిపై నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయా!

  • Published By: chvmurthy ,Published On : February 15, 2019 / 06:03 AM IST
నిర్లక్ష్య ఫలితమేనా : ఉగ్రదాడిపై నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయా!

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిఘా సంస్థలు ప్రమాదాన్ని ముందే హెచ్చరించినప్పటికీ  తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో సీఆర్పిఎఫ్ వైఫల్యం చెందిందని భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశానికి హాజరైన పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. 

ఐ.ఈ.డీ బాంబులతో దాడి చేసే అవకాశముందని ఫిబ్రవరి 8న నిఘా సంస్థలు హెచ్చరించాయి. కాన్వాయ్ వెళ్లేముందు ఆ ప్రాంతం అంతా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిఘా సంస్థలు ముందుగానే చెప్పాయి. అయినా  2వేల 500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకేసారి ఎందుకు పంపించారనే ప్రశ్నఇప్పుడు తలెత్తుతోంది. 

జాతీయ రహదారిపై నాకాబందీ ఎందుకు నిర్వహించలేదనే ప్రశ్న అధికారుల్లో ఉదయిస్తోంది. 350 కిలోల పేలుడు పదార్థాలు ఉన్న వాహనం జాతీయ రహదారిపై ఎలా వచ్చిందనే ప్రశ్న పలువురిని వేధిస్తోంది. వాతావరణం సరిగా లేనప్పుడు మిలటరీ హెలికాప్టర్ లో శ్రీనగర్ తరలించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారని భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశానికి హాజరైన  సీఆర్పిఎఫ్ డీజీని  పలువురు ప్రశ్నించినట్లు తెలిసింది. 

కాగా …. జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సహాయం అందించేందుకు 12 మంది సభ్యుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందం పుల్వామాకు బయలుదేరి వెళ్లింది.