Uttar Pradesh: అతిక్ అహ్మద్ హత్య.. యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చేశారు. ఇద్దరిని చంపడం యోగి ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ వైఫల్యం.

Uttar Pradesh: మాజీ ప్రజా ప్రతినిధి, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు పోలీసుల మధ్యలో మీడియా కెమెరాల ముందు దారుణ హత్యకు గురయ్యారు. వాళ్లను ఆ సమయంలో పోలీసులు గొలుసులతో కట్టేసి ఉండడాన్ని వీడియోల్లో చూడవచ్చు. వారి చుట్టూ పోలీసులు, మీడియా ప్రతినిధులు, లైవ్ కెమెరాలు ఉండగానే.. పాయింట్ బ్లాకులోకి వచ్చి కాల్చి చంపడంపై అనేక అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంత బహిరంగంగా వచ్చి కాల్చి చంపడమేంటని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటే అంత ధైర్యం చేసేవారు కారంటూ నేతలు, నెటిజెన్లు విమర్శిస్తున్నారు.
Atiq Ahmed Story: అతిక్ అహ్మద్ హత్య.. కుప్పకూలిన నేర సామ్రాజ్యం
బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి ఇదే అంశాన్ని లేవనెత్తారు. ‘‘గుజరాత్ జైలు నుంచి అతీక్ అహ్మద్‌ను బరేలీ జైలు నుంచి అతని సోదరుడు అష్రఫ్‌ను తీసుకువచ్చారు. అనంతరం గత రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో పోలీసు కస్టడీలో బహిరంగంగా కాల్చి చంపారు. ఉమేష్ పాల్ దారుణ హత్య జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్, ప్రభుత్వ పనితీరుపై చాలా తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తాయి. తాజాగా జరిగిన ఘటనలో కూడా అలాంటి ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ అత్యంత తీవ్రమైన, అత్యంత ఆందోళనకరమైన సంఘటనను గురించి గౌరవనీయులైన సుప్రీం కోర్టు కలుగజేసుకుని తగిన చర్యలు తీసుకుంటే మంచిది. ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్‌లో ‘చట్టాల ద్వారా చట్టబద్ధ పాలన’ కాకుండా ఎన్‌కౌంటర్ రాష్ట్రంగా మారడం ఎంతవరకు సముచితం? ఇది ఆలోచించాల్సిన విషయం’’ అని ట్వీట్ చేశారు.
ఇక ఈ విషయమై ఏఐఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ‘‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చేశారు. ఇద్దరిని చంపడం యోగి ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ వైఫల్యం. ఎన్‌కౌంటర్ రాజ్‌ను జరుపుకునే వారు కూడా ఈ హత్యకు బాధ్యులు. హంతకులు హీరోలుగా ఉన్న సమాజంలో కోర్టు, న్యాయ వ్యవస్థ పని చేయవు’’ అని ట్వీట్ చేశారు.
Karnataka Polls: ఎన్నికలకు ముందు బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం
‘‘యూపీలో నేరాలు తారాస్థాయికి చేరాయి. నేరగాళ్ల నైతిక స్థైర్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. పోలీసుల భద్రతా వలయం మధ్య ఉన్న వ్యక్తుల్ని బహిరంగంగా కాల్పులు జరిపి చంపే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక సాధారణ ప్రజల భద్రత గురించి ఏం చెప్తాం? ప్రజల్లో భయానక వాతావరణం ఏర్పడుతోంది. కొందరు కావాలనే ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలుస్తోంది’’ అని సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇక నెటిజెన్లు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. కొందరైతే ఈ హత్య ఉద్దేశపూర్వకంగా జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు.