Karnataka Polls: ఎన్నికలకు ముందు బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం
కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం షెట్టార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరో బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో షెట్టార్ అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది

Jagadish Shettar
Karnataka Polls: మరో కొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ (Former Karnataka CM and senior leader Jagadish Shettar) పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న ఆయనకు నిరాశే ఎదురైంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశమైనప్పటికీ టికెట్ మాత్రం లభించలేదు. దీంతో తీవ్ర కోపానికి లోనైన షెట్టర్.. బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు శాసన సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. ఇకపోతే.. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని షెట్టర్ స్పష్టం చేశారు. అయితే ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కొద్ది రోజుల నుంచి బీజేపీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు తనకు తీవ్ర అవమానకరమని అన్నారు. పార్టీ నేతలు తనను కించపరచినందువల్లే తాను రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని షెట్టర్ చెప్పారు.
రాష్ట్రంలోని కొందరు నేతలు బీజేపీ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారన్నారని షెట్టర్ మండిపడ్డారు. ఏదైనా పార్టీలో చేరడమా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమా? అనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నానని తెలిపారు. ఇదిలావుండగా, బీజేపీ ఉన్నత స్థాయి వర్గాలు స్పందిస్తూ, షెట్టార్ పార్టీ కన్నా తనకు తాను పెద్ద పీట వేసుకున్నారని విమర్శించాయి. తాను పార్టీ కన్నా గొప్పవాడిననే భావంతో వ్యవహరించారని, బీజేపీ పెద్దలు ఆయనతో మాట్లాడటానికి అనేకసార్లు ప్రయత్నించినట్లు తెలిపాయి. ఆయనకు పార్టీ అనేక ఆప్షన్స్ ఇచ్చిందని కూడా వెల్లడించాయి.
కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం షెట్టార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరో బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో షెట్టార్ అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇదిలావుండగా, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఒకప్పటి జనతాపరివార్‌కు చెందిన ప్రముఖ నేత బీ సోమశేఖర్ (B Somasekhar) శనివారం రాజీనామా చేశారు.