ఇంకో హనీమూన్ జంట మిస్సింగ్.. 12 రోజులైనా ఆచూకీ లేదు.. అసలేం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన నూతన జంట హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో వారు గల్లంతయ్యారు.

ఇంకో హనీమూన్ జంట మిస్సింగ్.. 12 రోజులైనా ఆచూకీ లేదు.. అసలేం జరిగిందంటే..?

Updated On : June 9, 2025 / 11:34 AM IST

Honeymoon couple Missing: మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌కు చెందిన నూతన దంపతులు రాజా రఘువంశీ, సోనమ్‌లు మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లి అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనమ్ సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సోనమ్ యూపీలో పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సమయంలోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హనీమూన్ కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ కు చెందిన నవ దంపతులు సిక్కింలో అదృశ్యమయ్యారు.

Also Read: హనీమూన్ కి తీసుకెళ్లి భర్తని చంపించేసిన భార్య.. సుపారీ కిల్లింగ్.. మొత్తం బయటపడిందిలా..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన నూతన జంట హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు. పదిహేను రోజులు గడిచినా, వారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మే 5వ తేదీన వివాహం చేసుకున్న కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ మే24న సిక్కింకు వెళ్లారు. మే 29న వారు ప్రయాణిస్తున్న కారు కొండచరియలు విరిగిపడటంతో మంగన్ జిల్లాలో వెయ్యి అడుగుల లోతుకలిగిన తీస్తా నదిలో పడిపోయింది. లాచెన్-లాచుంగ్ హైవే వెంబడి మున్సితాంగ్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదం సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది మంది ప్రయాణికులు కనిపించకుండా గల్లంతయ్యారు. వారిలో యూపీకి చెందిన నూతన దంపతులు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ కూడా ఉన్నారు. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. సిక్కింలో నా కొడుకు, కోడలు వాహనం వాగులో పడిపోవడంతో వారు కనిపించకుండా పోయారు. పన్నెండు రోజులు కావస్తున్నా ఇంకా వారి ఆచూకీ లభ్యంకాలేదు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని సిక్కిం ముఖ్యమంత్రిని అభ్యర్థించాలని నేను యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ షేర్ బహదూర్ సింగ్ అభ్యర్థించారు. నూతన జంటతోపాటు తప్పిపోయిన వారిలో నలుగురు ఒడిశాకు చెందినవారు కాగా, ఇద్దరు త్రిపురకు చెందినవారు.