ఇక రోహింగ్యా ముస్లింల వంతు – కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

ఇక రోహింగ్యా ముస్లింల వంతు అంటున్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR చట్టాలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. బెంగాల్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు రోహింగ్యాలు ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డారని, జమ్మూలో వీరి సంఖ్య అధికంగా ఉందన్నారు. 2020, జనవరి 04వ తేదీ శనివారం జమ్మూ కాశ్మీర్‌లో మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో కాశ్మీర్ ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కొత్త పౌరసత్వ సవరణ చట్టం ఆధారంగా దేశంలో అక్రమంగా స్థిరపడిన వీరిని వారి వారి దేశాలకు పంపించే ఏర్పాట్లు కేంద్రం చేస్తోందని ప్రకటించారు. కొత్త చట్ట ప్రకారం రోహింగ్యాలకు భారత పౌరసత్వం లభించదని కుండబద్ధలు కొట్టారు. ఎవరు ఎంత వ్యతిరేకిస్తున్నా పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తున్నామని వెల్లడించారాయన. రోహింగ్యాలకు సంబంధించి పౌరసత్వ సవరణ చట్టంలో ఎలాంటి ప్రస్తావన చేయలేదని గుర్తు చేశారు. మయన్మార్ నుంచి రోహింగ్యాలు భారత్‌లో ప్రవేశించారని, మరలా అక్కడకు వెళ్లాల్సిందేనన్నారు.
రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీయులు అధికంగా జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఉన్నారని, 2008 నుంచి 2016 వరకు వారి జనాభా 6 వేలకు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు. రోహింగ్యాలను దేశం నుంచి పంపేయాలని బీజేపీ, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్‌లతో పాటు ఇతర సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Read More : చిన్న మొక్కలతో ఒత్తిడి దూరం