ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా?

ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా?

Updated On : January 31, 2021 / 10:15 AM IST

NIA investigation into Delhi bomb blast : ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? ఐఈడీ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్ ప్రకటించడం ఇందుకు ఊతమిస్తోంది. మరోవైపు ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఇజ్రాయిల్‌ చెబుతోంది. దీంతో పేలుడు ఘటన వెనక ఎవరున్నారన్న కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో శుక్రవారం జరిగిన బాంబు పేలుడు ఘటనపై జాతీయ భద్రతా సంస్థ రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.

పేలుడు ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఓ క్యాబ్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయెలీ ఎంబసీవైపు నడుచుకుంటూ వెళ్ళారని గమనించారు. ఆ వాహనం నుంచి దిగిన ఇద్దరు వ్యక్తుల ఊహా చిత్రాలను రూపొందించే యత్నం చేస్తున్నారు. కారులో వచ్చిన దుండగులు ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థాన్ని చుట్టి దాన్ని పూలకుండీలో విసిరేసి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అందులో బాల్ బేరింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. సగం కాలిన పింక్ చున్నీని సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

పేలుడు జరిగిన ప్రాంతంలో శాంపిళ్లను పరిశీలించగా అందులో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు తేలింది. ఇలాంటి పేలుడు పదార్థాలను అల్‌ఖైదా, ఐస్ఐస్ వంటి ఉగ్రవాద సంస్థలే వినియోగిస్తాయి. ఈ నేపథ్యంలో ISISకి అనుబంధంగా ఉండే జైషే ఉల్ హింద్ -ఐఈడీ బ్లాస్ట్ తామే చేశామని జైష్‌కు చెందిన టెలిగ్రామ్‌ ఛానల్‌లో ప్రకటించింది. ఈ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. స్లీపర్‌ సెల్స్‌ వివరాలను కూడా ఎన్‌ఐఏ సేకరిస్తోంది.

ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. పేలుడు జరిగిన స్థలంలో ఓ లేఖను అధికారులు గుర్తించారు. ఈ పేలుడు కేవలం ట్రయిలరేనని ఆ లేఖలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇరాన్‌ అణు శాస్త్రవేత్త, జనరల్ అధికారిని చంపిన విషయాన్ని నిందితులు లేఖలో ప్రస్తావించినట్లు అధికారులు తెలిపారు. దానికి ప్రతీకారంగానే ఇజ్రాయిల్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి రాన్ మల్కా చెప్పారు. ఈ దాడికి గల కారణాలపై భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. అయితే పేలుడు వెనక ఎవరున్నారన్నది ఇంకా తెలియదని భారత్‌ తెలిపింది. 2012లో కూడా ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీకి సమీపంలో దాడి జరిగింది.