చౌకబేరం అంట : నీరవ్ మోడీ 12 లగ్జరీ కార్లు వేలం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నిందితుడు నీరవ్ మోడీ కార్లు వేలానికి సిద్ధమయ్యాయి. దేశం నుంచి పరారీ తర్వాత అతని ఇల్లు, వస్తువులు సీజ్ చేశారు. అందులో 12 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో రోల్స్ రాయిస్, పోర్సె పనమెరా, 2 మెర్సిడేజ్ బెంజ్, 3 హోండా కార్లు, టయోటా ఫార్చునర్, ఇన్నోవా, 2 హోండా బ్రియోస్‌తోపాటు ఇంకా ఎన్నో కార్లు నీరవ్ మోడీ గ్యారేజ్ లో పడి ఉన్నాయి.
వీటిలో రోల్స్ రాయిస్ కారు రూ. 5 కోట్లపైనే ఉంటుందని అంచనా. వేలంలో కోటి రూపాయల వరకు రావొచ్చు అంటున్నారు. ఈ లగ్జరీ కార్ల వేలానికి చాలా మంది పోటీ పడే అవకాశం కూడా ఉందనేది సమాచారం. మోడీ ఖరీదైన కార్లను వేలం వేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించిన తర్వాత.. వేలంపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. దీని కోసం ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతి కూడా తీసుకుంది.
బిడ్డర్లు వాహనాలను చెక్ చేసుకోవటానికి మాత్రమే అనుమతి ఉంది.. టెస్ట్ డ్రైవ్ కు మాత్రం అవకాశం లేదు. లగ్జరీ కార్లకు సంబంధించిన ఫొటోలు, వాటి ధర, మోడల్, రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలను మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్‌టీసీ) వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.