“నిర్బల సీతారామన్”…క్షమాపణలు చెప్పిన అధిర్ రంజన్

  • Published By: venkaiahnaidu ,Published On : December 4, 2019 / 02:38 PM IST
“నిర్బల సీతారామన్”…క్షమాపణలు చెప్పిన అధిర్ రంజన్

Updated On : December 4, 2019 / 2:38 PM IST

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం లోక్‌సభలో క్షమాపణలు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల తర్వాత ఆయన క్షమాపణలు తెలిపారు. నిర్మలా తనకు అక్కలాంటి వారని, నేను ఆమెకు తమ్ముడు లాంటివాడినని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ఆమెను బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం అధీర్‌పై ఒత్తిడి తెచ్చి క్షమాపణలు చెప్పించినట్లు సమాచారం.
 
కాంగ్రెస్ తప్ప అన్ని రాజకీయ పక్షాలూ చౌదరి చేసిన కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లోక్‌ సభలో సోమవారం అధిర్ చౌదరి మాట్లాడుతూ నిర్మల సీతారామన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు ఆమె పట్ల గౌరవం ఉందని, అయితే కొన్నిసార్లు తనకు ఆమెను ఏమని పిలవాలో తెలియడం లేదని అన్నారు.

మీరంటే నాకు గౌరవం ఉంది కానీ, నిర్మల సీతారామన్‌ అనడానికి బదులుగా ‘నిర్బల సీతారామన్’ అనడం సరైనదవుతుందా? కాదా? అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను. మీరు మంత్రి పదవిలో ఉన్నారు, అయితే మీరు మీ మనసు విప్పి మాట్లాడుతున్నారా? లేదా? అని నాకు సందేహం కలుగుతోంది’’ అని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. దీనిపై ఆమె కూడా ఘాటుగానే స్పందించింది.