Nirmala Sitharaman : కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 1.1లక్షల కోట్లు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ కుంగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Nirmala Sitharaman : కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 1.1లక్షల కోట్లు

Nirmala

Updated On : June 28, 2021 / 4:55 PM IST

Nirmala Sitharaman కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ కుంగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ కారణంగా నష్టపోయిన పలు రంగాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. 8 రిలీఫ్‌ ప్యాకేజీలను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో నాలుగు పూర్తిగా కొత్తవని,ఒకటి ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో మౌలికసదుపాయాల కోసమని నిర్మలా సీతారామన్ తెలిపారు.

కోవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ. 1.1లక్షల కోట్ల రుణాలకు సంబంధించి కేంద్రం గ్యారంటీ ఇస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో ఆరోగ్య రంగానికి రూ. 50 వేల కోట్లు, ఇతర రంగాలకు రూ. 60 వేల కోట్ల ఇవ్వనున్నట్టు తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు గతేడాది ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ప్రారంభించిన ఈసీఎల్‌జీఎస్(ఎమర్జెన్సీ క్రెడిల్ లైన్ గ్యారెంటీ స్కీమ్) పథకం లిమిట్‌ ను రూ. 3 లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు తెలిపారు. చిన్న ఆర్థిక సంస్థల ద్వారా 25 లక్షల మందికి రుణాలు ఇచ్చే అంశాన్ని కేంద్రం వెల్లడించింది. ఒక్క వ్యక్తికి గరిష్టంగా రూ. 1.25 లక్షల రుణాన్ని ఇవ్వునున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్తవారికి ఎక్కువగా రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.

కరోనా కారణంగా టూరిజం రంగం ఎక్కువగా నష్టపోయిన నేపథ్యంలో..టూరిజం ఏజెన్సీలకు రూ. 10 లక్షల వరకు తీసుకునే లోన్‌కు వంద శాతం గ్యారంటీ ఇవ్వనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. టూరిస్ట్ గైడ్‌లకు రూ. లక్ష వరకు తీసుకునే లోన్‌కు గ్యారంటీ ఇస్తామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రుణ హామీ పథకం ద్వారా చిన్న పట్టణాల్లోని వారికి కూడా లబ్ది చేకూరుతుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఇక,ప్రజారోగ్యం కోసం రూ .23,220 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉపయోగించనున్నట్లు తెలిపారు. వీటిలో పిల్లలు, వారి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు,అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభమైన తర్వాత, దేశానికి వచ్చే తొలి 5 లక్షల మంది పర్యాటకులు వీసా ఫీజు రద్దు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ స్కీం 31 మార్చి, 2022 వరకు అందుబాటులో ఉండనుంది. దీనిలో భాగంగా ఒక పర్యాటకుడు ఒకసారి మాత్రమే ఉపయోగించుకునేట్లు నిబంధనలు విధించినట్లు తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన కింద పీఎఫ్ ఖాతాదారులకు మరింత కాలం మద్దతు అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని తెలిపారు. కంపెనీ కంట్రిబ్యూషన్ కూడా తామే చెల్లిస్తామని పేర్కొన్నారు. అంటే కేంద్రమే 24 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తుంది. ఈ ఫెసిలిటీని 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంచుతామని నిర్మలమ్మ వెల్లడించారు. సాధారణంగా అయితే ఈ బెనిపిట్ ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ నెలలో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. రూ.15 వేలలోపు వేతనం కలిగిన వారికి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ఇక, బడుగు,బలహీన వర్గాల ఆహార భద్రత కోసం గత ఏడాది ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్నాయోజన పథకం 2021 నవంబర్ వరకు పొడిగంచినట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.