ఆ అమ్మాయి గోడు పట్టించుకోండి….మోడీకి నితీష్ లేఖ

గంగానది ప్రక్షాళన కోసం గతేడాది డిసెంబర్ నుంచి బీహార్ కు చెందిన సాధ్వి పద్మావతి చేపట్టిన ఆమరణ దీక్ష విరమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ(జనవరి-23,2020)ఆయన ప్రధానికి లేఖ రాశారు. హరిద్వార్‌లోని మాతృ సదన్ ఆశ్రమంలో సాధ్వి పద్మావతి లేవనెత్తిన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. గంగానది ప్రక్షాళన కోసం డిసెంబర్ 15 నుంచి ఆమె దీక్ష చేపట్టారు.
దీర్ఘకాలిక పోరాటం ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను అని నితీశ్ కుమార్ మోడీకి రాసిన లేఖలో తెలిపారు. బీహార్‌కి చెందిన 23 ఏళ్ల సాధ్వి పద్మావతి నలంద యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో బీఏ ఆనర్స్ పట్టా పొందారు. గంగానది ప్రక్షాళన, పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హరిద్వార్‌లోని మాతృ సదన్ ఆశ్రమంలో ఆమె గత నెల 15 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
2019 డిసెంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ప్రధాని మోడీ అధ్యక్షత జరిగిన జాతీయ గంగా కౌన్సిల్ యొక్క మొదటి సమావేశంలో… గంగానది పునరుజ్జీవనం సహకార సమాఖ్యవాదానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా ఉండాలని మోడీ అన్నారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….2015-20మధ్యకాలానికి గంగా ప్రయాణిస్తున్న ఐదు రాష్ట్రాలకు తగినంత మరియు నిరంతరాయ ప్రవాహాన్ని నిర్ధారించడానికి రూ .20,000 కోట్లు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.