ఆరోగ్యసేతు యాప్ లేదా.. వెయ్యి ఫైన్+6నెలల జైలు

మొబైల్ లో ఆరోగ్యసేతు యాప్ లేదా.. అయితే మీకు వెయ్యి రూపాయల ఫైన్ దాంతో పాటు 6నెలల జైలు శిక్ష కూడా తప్పదు. నోయిడా పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో ఉండే వారి స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని ఈ ఆదేశాలు జారీ చేశారు.
‘స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు తప్పనిసరిగా ఈ యాప్ కలిగి ఉండాలి. లేదంటే సెక్షన్ 188 ప్రకారం.. వారిపై చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత వారికి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఎటువంటి శిక్ష వేయాలో నిర్ణయిస్తుంది. లేదంటే హెచ్చరించైనా వదిలేస్తాం’ అపి డీసీపీ (లా అండ్ ఆర్డర్) అఖిలేశ్ కుమార్ చెప్పారు.
సెక్షన్ 188అంటే పబ్లిక్ సర్వీసు చేసే వారి ఆదేశాలు ధిక్కరించడం. అటువంటి వారికి 6నెలల జైలు, వెయ్యి రూపాయల ఫైన్ తప్పనిసరి. ‘అప్పటికప్పుడు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే వారిని వదిలేస్తున్నాం. ప్రజలు దీనిని సీరియస్ గా తీసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలి. పదేపదే చెప్తున్నా వారు పట్టించుకోకపోతే మేం యాక్షన్ తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.
ఎవరైన మొబైల్ డేటా లేదని చెప్తే వారికి డేటా కూడా అందిస్తాం. ‘డౌన్ లోడ్ చేసుకోవడానికి అవసరమైతే మా హాట్ స్పాట్ ఆన్ చేసి మొబైల్ డేటా ఇస్తాం. స్టోరేజి తక్కువగా ఉందనే సమస్య చెప్తే ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకుని తర్వాతైనా డౌన్ లోడ్ చేశాడా అనేది కనుక్కుంటాం. సరిహద్దుల్లో, మార్కెట్ ప్రాంతాల్లో, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో పోలీసులతో పాట్రోలింగ్ చేసి చెకింగ్స్ నిర్వహిస్తున్నారు.