శుభవార్త : ఉద్యోగ కోతలు లేవు..జీతాలు చెల్లిస్తున్నాం – స్పైస్ జెట్

కరోనా భూతం ఎంతో మందిని అతలాకుతలం చేస్తోంది. జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ రాకాసి కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులపై దీని ఎఫెక్ట్ పడింది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా…పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. లాక్ డౌన్ సడలించిన ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. కానీ మెజార్టీగా ఇందులో పనిచేసే వారికి వేతనాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం…విమానాలకు తాకింది.
లాక్ డౌన్ విధించడంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. వీటిపై ఆధారపడి పనిచేసే వారు కష్టాలు చెప్పనవసరం లేదు. తాజాగా ఉద్యోగాల్లో కోతలు విధించడం లేదని, ఎక్కువ మంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుందని సంస్థ శుభవార్త చెప్పింది.
కరోనా వైరస్ కారణంగా సంస్థ నష్టపోతున్నా…కోతలు విధించడం లేదని తెలిపింది. ఏప్రిల్ నెలలో 92 శాతం మంది ఉద్యోగుల జీతంలో కొంతభాగం కంపెనీ చెల్లిస్తోందని 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం తెలిపింది. వైరస్ వ్యాపిస్తుండడంతో విమానరంగంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మరలా విమానాలు ఎప్పుడు ప్రారంభమౌతాయో తెలియని సందిగ్ధత నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక విమానయాన సంస్థలు ఉద్యోగుల ఉపసంహరణ, జీతాలను నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. చేసిన పని గంటల ఆధారంగా జీతాలు చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఇది తాత్కాలికమని, ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత..తమ పూర్వవైభవానికి చేరుకొనేందుకు కృషి చేస్తామని స్పైస్ జెట్ వెల్లడించింది. ప్రస్తుతం అత్యవసర సర్వీసులు, రవాణాకు సంబంధించిన వాటికి మాత్రమే విమానాలు తిరుగుతున్నాయి.