ఎలక్షన్ ఫేక్ వార్త: ఎన్ఆర్ఐలకు అటువంటి చాన్స్ లేదు

ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలు కూడా అనుకూల వ్యక్తులను ప్రోత్సహిస్తూ ప్రచారాలను పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలవేళ ఫేక్ న్యూస్‌ల హడావిడి కూడా పెరిగిపోయింది. మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా అద్భుత సాధనం. కానీ.. రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను కూడా పాడు చేసేశాయి.
తమ నేతలకు అండగా ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేయడం పార్టీల వీరాభిమానులకు పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో పలానా విషయం పోస్ట్ చేయకూడదన్న నియమం ఏమీ లేదు. ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఒక న్యూస్ వండివార్చితే చాలు వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఫేక్ రాయుళ్లు కూడా ఇదే అదనుగా చూసుకుని వార్తలను వైరల్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఎన్నారైలకు సంబంధించిన ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఎన్నారైలకు ఎలక్షన్ కమిషన్ ఆన్‌లైన్‌లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించిందని, అందుకోసం ఎన్నారైలు eci.gov.in వెబ్‌సైట్‌లో తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ వార్త గురించి తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ అధికార ప్రతినిధి శేపాలి శయాన్.. అటువంటిది ఏమీ లేదంటూ ఫేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఎన్ఆర్ఐల కోసం ఆన్‌లైన్‌లో ఎటువంటి సదుపాయం కల్పించలేదంటూ స్పష్టం చేశారు. అలాగే ఓటు హక్కు వివరాలు నమోదు చేసుకునేందుకు http://nvsp.in వెబ్‌సైట్‌ను మాత్రమే వాడుకోవడం మంచిదని చెప్పారు.