కాంట్రాక్ట్ ఫార్మింగ్,వ్యవసాయ భూములను కొనే ఆలోచనల్లేవ్…రిలయన్స్ క్లారిటీ

No plans to enter contract farming, buy agricultural land: RIL రిలయన్స్ కి వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆందోళనలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం(జనవరి-4,2021)కొన్ని అంశాలపై రిముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) స్పష్టమైన ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా కార్పొరేట్ ఫార్మింగ్ వంటి ప్లాన్స్ ఏవీ తమకు లేవని రిలయన్స్ తేల్చిచెప్పింది. రైతుల సాధికారతే తమకు ముఖ్యమన్న రిలయన్స్ ఇండస్ట్రీస్…తమకు ఇలాంటి వాటిలోకి వెళ్లే ఉద్దేశం లేదని తెలిపింది.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల తమకు మద్దతు ధర లభించదనీ, తమ భూములను కాంట్రాక్ట్ లేదా కార్పొరేట్ ఫార్మింగ్ పేరుతో… కార్పొరేట్ వర్గాలు లాగేసుకుంటాయనే అభిప్రాయంతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రిలయన్స్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.
పంజాబ్‌లో రిలయన్స్ జియో కమ్యూనికేషన్ టవర్లపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ… తాము ఓ రిట్ పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టులో వేసినట్లు రిలయన్స్ తెలిపంది. సంస్థ ఉద్యోగులు, సంస్థ ఆస్తులకూ నష్టం జరగకుండా ఉండేలా వెంటనే ప్రభుత్వ అధికారులు అత్యవసరంగా దీంట్లో జోక్యం చేసుకునేలా ఆదేశం ఇవ్వాల్సిందిగా హైకోర్టును పిటిషన్‌లో కోరింది. ఈ దాడుల వెనక కొన్ని ప్రత్యేక శక్తులు, వ్యాపార శత్రువులు ఉన్నట్లు రిలయన్స్ ఆరోపించింది
రిలయన్స్.. కార్పొరేట్ ఫార్మింగ్ (కార్పొరేట్ వ్యవసాయం) కోసం లేదా కాంట్రాక్టం ఫార్మింగ్ కోసం ఎప్పుడూ వ్యవసాయ భూమిని కొనలేదనీ, అలాంటి ప్లాన్స్ ఏవీ తమకు లేవని చెప్పింది. అంతేకాదు… తాము ఎప్పుడూ ఆహార ధాన్యాలను రైతులు, వారి సప్లయర్ల నుంచి డైరెక్టుగా కొనట్లేదనీ… ఏది కొన్నా కనీస మద్దతు ధరకే కొంటున్నట్లు తెలిపింది. తక్కువ ధరలకు ఎలాంటి దీర్ఘ కాలిక ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టులూ తాము కుదుర్చుకోలేదని తెలిపింది.
పంజాబ్‌లో ఈమధ్య కొన్ని వారాలుగా రిలయన్స్ యాజమాన్యం కిందకు వచ్చే జియో టెలికం గేర్‌కి సంబంధించిన దాదాపు 1500 టవర్లపై దాడులు జరిగాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ… ఆందోళనలు చేస్తున్న రైతులే నాశనం చేశారనే ప్రచారం జరిగింది. నవంబర్‌లో కొంతమంది రైతుల బృందాలు పంజాబ్‌లోని రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లను బలవంతంగా మూసివేయించారు. ఈ కొత్త చట్టాలు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉంటాయని జరుగుతున్న ప్రచారంతో రైతులు ఇలాంటి ఆందోళనలకు దిగినట్లు తెలిసింది.
మరోవైపు, పంజాబ్, హర్యానా సహా కొన్ని రాష్ట్రాలకు చెందిన వేల మంది రైతులు… ఢిల్లీ సరిహద్దుల్లో కంటిన్యూగా ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ 26న ఈ ధర్నాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తెచ్చిన చట్టాలను పూర్తిగా రద్దు చెయ్యాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే… కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే ఆరుసార్లు చర్చలు జరిగాయి. ఆరు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఇవాళ(జనవరి-4,2020) మరోసారి ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో రైతులతో చర్చలు ప్రారంభించింది కేంద్రం. వీటిని చివరి రౌండ్ చర్చలుగా రైతులు భావిస్తున్నారు. ఇవాళ్టి చర్చలు విఫలమైతే మొత్తం ఢిల్లీని దిగ్బంధిస్తామని రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.