కరోనా పుట్టింది వూహాన్ లోనే…చైనా వాదనకు ఆధారాల్లేవన్న హర్షవర్థన్

harsh-vardhan
No proof to back China’s claim of simultaneous Covid outbreak across nations కరోనా వ్యాప్తి విషయంలో ఇటీవల చైనా చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చైనాలోని వూహాన్ సిటిలో పుట్టలేదని.. 2019లోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని…మొదటిగా దానిని తామే రిపోర్ట్ చేసి..ప్రపంచానికి మేలు చేశామని గత వారం చైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే, చైనా వ్యాఖ్యలపై ఇవాళ కేంద్రఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ స్పందించారు. సోషల్ మీడియాలో తన అనుచరులతో ‘సండే సంవాద్’ చర్చా కార్యక్రమం 6వ ఎపిసోడ్లో పాల్గొన్న హర్షవర్ధన్… ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. చైనా చేస్తోన్న వాదనకు తగిన ఆధారాలేమీ లేవని ఈ సందర్భంగా హర్షవర్థన్ స్పష్టం చేశారు. మొదట చైనాలోని వుహాన్ నుంచే వైరస్ వ్యాపించిందన్నారు. చైనా చెబుతున్నట్లు వుహాన్ తో పాటే ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఒకే సమయంలో కరోనా కేసులు నమోదయ్యాయని ధ్రువీకరించేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు
భారత్లో కరోనా సామూహిక వ్యాప్తి కొన్ని రాష్ట్రాల్లోని పలు జిల్లాలకే పరిమితమైందని తెలిపారు. వెస్ట్ బెంగాల్ లో సామూహిక వ్యాప్తి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పిన విషయంపై ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. బెంగాల్ సహా జనసాంద్రత అధికంగా ఉండే కొన్ని జిల్లాల్లోనే వైరస్ సామూహిక వ్యాప్తి ఉందన్నారు. అయితే దేశవ్యాప్తంగా మాత్రం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.
భారత్లో కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పులు గుర్తించలేదని హర్షవర్ధన్ చెప్పారు. వైరస్ వ్యాప్తి సామర్థ్యం పెరగడం, ప్రమాద తీవ్రత అధికమవడం వంటి విషయాలకు సంబంధించిన ఆధారాలు లేవని హర్షవర్థన్ తెలిపారు.