కోలార్ విస్ట్రాన్ కంపెనీ వద్ద ఆగని విధ్వంసం..రూ.6 కోట్ల విలువైన కంపెనీ బస్సులు, కార్లు ధ్వంసం

Non-stop destruction at Kolar Wistron Company : కర్నాటకలోని కోలార్‌లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 7వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 6 కోట్ల రూపాయల విలువైన విస్ట్రాన్ కంపెనీ బస్సులు, కార్లను తగలబెట్టారు. కార్యాలయం ఎదుట ఉద్యోగుల బంధువులు కూడా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కర్నాటక సెంట్రల్ సెక్టార్ ఐజీ సీమంత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జీతాల అంశంపై ఉద్యోగులతో చర్చలు జరుగుతున్నాయని..చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. జీతాలపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఉద్యోగులు దాడులకు పాల్పడడం తప్పని అన్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
దాడికి పాల్పడిన వంద మందికి పైగా ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్లను వది లేయాలంటూ బంధువులు పోలీసుల ఎదుట బైఠాయించారు. కంపెనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సాయంత్రం జపాన్ నుంచి విస్ట్రాన్ కంపెనీ సీఈఓ కోలార్ వస్తున్నట్టు సమాచారం.