Yashodhara Mishra : ఒడిశా రచయిత్రి యశోధర మిశ్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ ఒడిశా రచయిత్రి యశోధర మిశ్రకు 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించింది.

Odisha Writer Yashodhara Mishra
Sahitya Akademi Award at Yashodhara Mishra : ప్రముఖ రచయిత్రి యశోధర మిశ్రకు 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించింది. ఒడిశాకు చెందిన ప్రముఖ రచయిత్రి, విద్యావేత యశోధర మిశ్రకు అకాడమీ ఒడియా, మలయాళ భాషలకు అవార్డులను ప్రకటించింది. రచయితలు డాక్టర్ బినపాణి మొహంతి, డాక్టర్ ప్రతిభా సత్పతి, రమాకాంత రథ్‌తో కూడిన ముగ్గురు సభ్యుల జ్యూరీ సిఫారసు మేరకు యశోధర రచించిన ‘సముద్ర కులె ఘొరో’ (సాగర తీరంలో ఇల్లు) (‘Samudrakula Ghara’)కథల సంకలనానికి ఈ పురస్కారం వరించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం జ్ఞాపికతో పాటు రూ.లక్ష నగదు పారితోషకం అందజేయనున్నట్లు అకాడమీ తెలిపింది. యశోధర ప్రముఖ రచయిత ఆచార్య భువనేశ్వర్ మిశ్ర కుమార్తె. యశోధర సంబల్‌పూర్‌లో 1951లో జన్మించారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సరోజినీ నాయుడు కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆ తరువాత ఢిల్లీలో సెటిల్ అయ్యారు. 2018లో ఆమె రచించిన సముద్ర కులె ఘొరో కథల సంకలనానికి పాఠకుల నుంచి ఎంతో ఆదరణ వచ్చింది. యశోధర రచించిన జొహ్నొరాతి, ముహోపొంజ, రేఖాచిత్రో, దెఖానోహలి, సొబుటుసుఖీఝియో, ద్వీపో తదితర రచనలు సైతం మన్ననలందుకున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆమెకు అవార్డు లభించడంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు.