Skeleton Bank: బాబోయ్.. సమాధిని తవ్వి అస్థిపంజరం తీసుకుని బ్యాంకుకి వెళ్లిన వ్యక్తి.. ఒడిషాలో షాకింగ్ ఘటన..
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. బ్యాంకు అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఒడిశా గ్రామీణ బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. అసలేం జరిగిందో వివరణ ఇచ్చారు.
Skeleton Bank: ఒడిశాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకి వెళ్లాడు. అస్థిపంజరాన్ని బ్యాంకు అధికారుల ముందు ఉంచాడు. దాంతో బ్యాంకు సిబ్బంది బిత్తరపోయారు. ఆ వ్యక్తి అస్థిపంజరాన్ని మోసుకురావడం కళ్లారా చూసిన స్థానికులు సైతం విస్తుపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆ వ్యక్తి అస్థిపంజరాన్ని ఎందుకు బ్యాంకుకి మోసుకొచ్చాడు? అసలేం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..
తన సోదరి బ్యాంకు ఖాతాలోని 20వేల రూపాయలు విత్‌డ్రా చేసుకోవడానికి 3 నెలలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. నిబంధనల పేరుతో బ్యాంకు సిబ్బంది డబ్బులు ఇవ్వలేదు. దీంతో విసిగిపోయి గిరిజిన వ్యక్తి ఇలా చేశాడు.
కియోంజర్ జిల్లా దియానలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50) గిరిజనుడు. అతడి సోదరి పేరు కల్రా ముండా(56). ఆమెకు ఒడిశా గ్రామీణ బ్యాంక్ మాలిపోసి బ్రాంచ్ లో అకౌంట్ ఉంది. జనవరి 26న ఆమె చనిపోయింది. ఆ సమయానికి ఆమె బ్యాంక్ అకౌంట్ లో 20వేల రూపాయల నగదు ఉంది. ఆ డబ్బు విత్‌డ్రా చేసి ఇవ్వాలని జీతూ ముండా బ్యాంకు సిబ్బందిని కోరాడు. అయితే, ఖాతాదారుడు వస్తేనే సొమ్మును విత్‌డ్రా చేయడానికి వీలవుతుందని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. తన సోదరి మరణించిందని చెప్పడంతో డెత్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లు తీసుకురావాలని బ్యాంక్ అధికారులు జీతూకు సూచించారు.
అస్థిపంజరంతో 3 కిలోమీటర్లు నడుచుకుంటూ..
అయితే నిరక్షరాస్యుడైన జీతూకు ఏం చేయాలో అర్థం కాలేదు. మరో దారి లేక సమాధిని తవ్వి తన సోదరి అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. దాన్ని ఒక సంచిలో చుట్టుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంక్‌కు తీసుకొచ్చాడు. అస్థిపంజరాన్ని చూసిన బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు షాక్‌కి గురయ్యారు. బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడితో మాట్లాడారు. ఎందుకిలా చేశావు అని అడిగారు.
తన సోదరి మరణించిందని బ్యాంక్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని జీతూ వాపోయాడు. ఆమెను తీసుకొస్తేనే డబ్బు ఇస్తామని చెబుతున్నారని, అందుకే ఏం చేయాలో తెలియక సమాధిని తవ్వి తన సోదరి అస్థిపంజరాన్ని తీసుకొచ్చానని వివరించాడు. గిరిజన వ్యక్తి చెప్పిన మాటలు విని పోలీసులు సహా అంతా చలించిపోయారు. అయ్యో పాపం అని జాలి చూపించారు. అంతేకాదు నీకు మేము సాయం చేస్తామని, బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసి ఇస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అస్థిపంజరాన్ని సమాధిలో పూడిపించారు.
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. బ్యాంకు అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గిరిజనుడి పట్ల కొంచెం కూడా మానవత్వం లేకుండా వ్యవహరించారని బ్యాంకు సిబ్బందిపై జనాలు మండిపడ్డారు. బ్యాంకు సిబ్బంది ప్రవర్తన కరెక్ట్ కాదన్నారు. దీంతో ఒడిశా గ్రామీణ బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. అసలేం జరిగిందో వివరణ ఇచ్చారు.
”జితు ముండా తన సోదరి ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేయమని కోరుతూ మొదటిసారి బ్రాంచ్‌కు వచ్చారు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, సరైన అధికారం లేకుండా ఇతరుల ద్వారా డబ్బు విత్‌డ్రా చేయడానికి అనుమతి లేదు. ఈ విషయం తెలియజేయగా, ఖాతాదారురాలు మరణించారని అతను చెప్పాడు. మరణం సంభవించినప్పుడు, మరణ ధృవీకరణ పత్రంతో సహా చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే సెటిల్మెంట్ ప్రక్రియ జరుగుతుందని మా బ్రాంచ్ మేనేజర్ స్పష్టంగా వివరించారు.
మద్యం మత్తులో గొడవ చేసి..
మద్యం మత్తులో ఉన్న జీతూ గొడవ చేశాడు. తన సోదరి సమాధిని తవ్వి అస్థిపంజరం బయటకు తీశాడు. దాన్ని బ్రాంచ్ ముందు ఉంచాడు. ఇది తన సోదరి అస్థిపంజరం అని చెప్పాడు. ఆమె ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ ప్రాంగణంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వెంటనే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించగా, వారి పర్యవేక్షణలో ఈ విషయం పరిష్కరించబడింది.
క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియపై అవగాహన లేకపోవడం వల్లే..
క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియపై అవగాహన లేకపోవడం, బ్రాంచ్ మేనేజర్ వివరించిన విధానాలను ఆ వ్యక్తి అంగీకరించడానికి ఇష్టపడకపోవడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఖాతాలోని పేద గిరిజన మహిళ డబ్బు ప్రయోజనాలను కాపాడటమే బ్యాంకు ఉద్దేశం. వేధింపులకు సంబంధించిన ఎలాంటి కేసు లేదు. మరణ ధృవీకరణ పత్రం జారీ కోసం బ్యాంకు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. మరణ ధృవీకరణ పత్రం సమర్పించిన వెంటనే క్లెయిమ్ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించబడుతుంది. మా కస్టమర్లకు చట్టబద్ధమైన, పారదర్శకమైన సేవను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం” అని బ్యాంకు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
Odisha Man Digs Up Sister’s Skeleton as Proof to Claim the Money in Her Account pic.twitter.com/R60SpYSAQD
— COMRDE SULEIMAN ABUBAKAR BARDE (@Comrdebarde) April 28, 2026
🚨 SKELETON IN ODISHA BANK!
In Odisha, a brother took his dead sister’s skeleton to the bank so that he could withdraw ₹20k, because the bank was insisting on Physical Presence.
The traditional banking KYC system has forgotten humanity.
This is why people are choosing Crypto… pic.twitter.com/8ITd0AEZc1
— Crypto Aman (@cryptoamanclub) April 28, 2026
