LPG Gas Cylinder Prices: గుడ్ న్యూస్… గ్యాస్ ధరలు తగ్గింపు.. ఒక్కో సిలిండర్ పై..
ఇకపై కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1723.50గా ఉండనుంది.

Gas Cylinder
LPG Gas Cylinder Prices: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ ధరలు తగ్గించాయి. ఒక్కో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై 24 రూపాయలు తగ్గించాయి. ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1723.50గా ఉండనుంది. ఏప్రిల్ లో కూడా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.1762కి తగ్గించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో 7 రూపాయలు తగ్గించారు. అయితే, మార్చిలో మళ్లీ 6 రూపాయలు పెంచారు. కాగా, డొమిస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
కొత్త ధరల సర్దుబాటు వాణిజ్య సంస్థలకు అలాగే రెస్టారెంట్లు, హోటళ్ళు ఇతర చిన్న వ్యాపారాలకు సానుకూల వార్త అవుతుంది. ఇవి తమ కార్యకలాపాల కోసం LPG పై ఎక్కువగా ఆధారపడతాయి. భారత దేశంలో దాదాపు 90 శాతం LPG వినియోగం ఇంటి వంట కోసం ఉపయోగించబడుతుంది. మిగిలిన 10 శాతం పారిశ్రామిక, వాణిజ్య, ఆటోమోటివ్ రంగాలలో ఉపయోగించబడుతుంది. స్థానిక పన్నులు, రవాణ ఖర్చుల ఆధారంగా రాష్ట్రం నుండి రాష్ట్రానికి LPG గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగిన తర్వాత.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మార్చిలో ఎల్‌పిజి డొమిస్టిక్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 65డాలర్ల వద్ద స్థిరంగా ఉంటే, 2026 ఆర్థిక సంవత్సరంలో చమురు మార్కెటింగ్ కంపెనీల LPG నష్టాలు దాదాపు 45 శాతం తగ్గుతాయని అంచనా. గత పదేళ్లలో దేశీయ LPG వినియోగదారుల సంఖ్య రెట్టింపైంది. ఏప్రిల్ 1, 2025 నాటికి సుమారు 33 కోట్లకు చేరుకుంది.