28 రోజులు సముద్రంలోనే.. రెండు తుఫాన్లు.. స్నేహితుడి శవంతో ప్రయాణం

28 రోజులు సముద్రంలోనే.. రెండు తుఫాన్లు.. స్నేహితుడి శవంతో ప్రయాణం

Updated On : October 27, 2019 / 11:52 AM IST

ఒడిశాలోని ఖైరిసాహి తీర ప్రాంతానికి పడవ కొట్టుకొచ్చింది. తీరాన్ని చూడగానే పడవలో ఒంటరిగా ఉన్న వ్యక్తి ప్రాణం లేచివచ్చినట్లయింది. అతని వివరాలు చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ముక్కునవేలేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఉండే 49ఏళ్ల అమృత్ కుజూర్ అనే వ్యక్తి సముద్రం దాటి బంగాళాఖాతంలో రెండు తుఫాన్లను ఎదుర్కొని తీరానికి చేరుకున్నాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశా తీరం నుంచి 13వందల కిలోమీర్టలో దూరంగా ఉన్న అండమాన్ ఐలాండ్ లో బయల్దేరాడు. సెప్టెంబరు 28న అతని స్నేహితుడుతో కలిసి మంచి నీళ్లను, రూ. 5లక్షల వస్తువులను తీసుకుని పడవలో ప్రయాణమైయ్యాడు. మార్గం మధ్యలో తుఫాన్ రావడంతో చిక్కుకుపోయారు. అలల తాకిడికి పడవ దెబ్బ తింటుండటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలో దారి తప్పిపోయారు. తుఫాన్ కారణంగా పడవ దెబ్బతినడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా పాడైయింది. ప్రాణాలు కాపాడుకోవాలనే తపనలో పడవలో ఉన్న రూ.5లక్షల విలువైన సామానును నీళ్లలో పడేశారు. అయినప్పటికీ ప్రమాదం తీవ్రత తగ్గలేదు. పడవలో ఉన్న ఆయిల్ కూడా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో ఎదురుచూస్తున్న వారికి అటుగా వెళ్తోన్న వాణిజ్య నౌక సహాయం చేసింది.

260లీటర్ల డీజిల్ ను, దిక్సూచిని ఇచ్చింది. వాటి సాయంతో ప్రయాణమైన వారిని మరో తుఫాన్ కుదిపేసింది. బంగాళాఖాతంలో యాంకర్ వేసుకుని పడవను ఆపుకోగలిగారు. కానీ, మరోసారి పడవ పూర్తిగా పాడైపోయింది. నీళ్లు చేరినా పూర్తిగా మునిగిపోకుండా ఆగింది. వారం రోజులుగా తిండి లేకపోవడంతో తనతో పాటు వచ్చిన స్నేహితుడు మరణించాడు. శవంతోనే రెండ్రోజులు ప్రయాణించి కుళ్లిన వాసన వస్తుండటంతో నీళ్లలో పడేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తి తెలిపారు. 

ఖైరిసాహి తీర ప్రాంతానికి చేరుకున్నాక స్థానికులు పరిస్థితి వివరించాడు. అధికారులు అప్రమత్తమై కుటుంబ సభ్యులకు సమాచారం అందింది రెండ్రోజుల్లో అతణ్ని ఇంటికి పంపారు.