సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు.. తల్లిదండ్రులు ఏం అంటున్నారంటే?

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే తల్లిదండ్రులు కేవలం 31 శాతం మాత్రమే ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా ఉన్నారు. 61 శాతం తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రభుత్వ పాఠశాలలను సెప్టెంబర్‌లో ప్రారంభించాలనే ఆలోచనతో లోకల్ సర్కిల్స్ ఢిల్లీ-ఎన్‌సిఆర్ తల్లిదండ్రులైన 3443 మంది అభిప్రాయాలు తీసుకున్నారు.
సర్వేలో సెప్టెంబర్ నుంచి పాఠశాల ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నారా అని అడిగారు. దీనికి సమాధానంగా 31 శాతం మంది అవును అని ప్రతిస్పందించారు, 61 శాతం మంది మాత్రం పాఠశాలలకు పంపడానికి నిరాకరించారు. ఎనిమిది శాతం తల్లిదండ్రులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
తల్లిదండ్రులను పాఠశాల ఎందుకు తెరవడానికి అనుకూలంగా లేరని రెండవ ప్రశ్న అడిగారు, దీనికి ప్రతిస్పందనగా తల్లిదండ్రులు.. కరోనా మహమ్మారి కారణంగా తమ పిల్లలను పాఠశాలకు పంపించడం ద్వారా రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నట్లు చెప్పారు.
మరికొంతమంది తల్లిదండ్రులు పాఠశాలలో శారీరక దూరాన్ని పాటించడం సాధ్యం కాదని నమ్ముతున్నారు. అదే సమయంలో, కరోనా పరిస్థితిని బట్టి, ఆన్‌లైన్ విద్య సరైన ఎంపిక అని కొందరు తల్లిదండ్రులు అంటున్నారు. ఆగస్టు 31 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.