మండిపాటు : రాజ్యసభ ఎలా పొడిగిస్తారు – విపక్షాలు

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 01:44 PM IST
మండిపాటు : రాజ్యసభ ఎలా పొడిగిస్తారు – విపక్షాలు

ఢిల్లీ : రాజ్యసభ పొడిగింపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యసభలో విపక్షాల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. రాజ్యసభ శీతకాల సమావేశాల పొడగింపును నిరసిస్తూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా సభను ఎలా పొడగిస్తారంటూ సభలో ఆందోళనలు చేపట్టారు. పొడిగింపుపై ఏకగ్రీవ తీర్మానం లేకుండా ఎలా కొనసాగిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. రాజ్యసభలో ఇప్పటివరకూ రఫేల్‌ సహా తాము డిమాండ్‌ చేస్తున్న అంశాలపై ఇంతవరకూ చర్చ జరగలేదని అన్నారు. అయితే బీఏసీ సమావేశంలోనే రాజ్యసభ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని, ఈ సమావేశానికి చాలా మంది విపక్ష సభ్యులు హాజరయ్యారని.. డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.
అయితే, అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు, ముమ్మారు తలాక్‌ బిల్లు వంటి కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందునే సభను పొడిగించామని కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ చెప్పారు. సభ పొడిగించడాన్ని దేశం మొత్తం కోరుకుంటోందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆందోళన చేస్తున్న సభ్యులతో అన్నారు. పేదలకు రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ జనవరి 08వ తేదీ మంగళవారం ఆమోదించిన సంగతి తెలిసిందే.