బంగాళాఖాతంలో విసిరిగొట్టండి: పౌరసత్వ బిల్లుపై విపక్షం

రాజ్యసభలో బుధవారం(డిసెంబర్ 12,2019) నాడు వాడీవేడీగా పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చల్లో విపక్షం అమిత్ షాపై విరుచుకుపడింది. తృణమూల్ అయితే.. నాజీ ప్లేబుక్ నుంచి ఎత్తుకొచ్చిన ఎత్తుగడలతో దేశాన్ని ధ్వంసం చేస్తున్నారని అంటే… ఐయుఎంఎల్ ఏకంగా వినాశనానికి ఈ చట్టం కారణం కాబోతోందని విమర్శించింది.
రాజ్యసభలో అనుకున్నదానికన్నా విపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా కనిపించడం బీజేపీకి ధైర్యాన్ని పెంచింది. అదే సమయంలో.. బలం ఉంది కాబట్టే బిల్లును నెగ్గించుకున్నారు. కోర్టు మాత్రం అడ్డంగా కొట్టివేస్తుందన్న నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రదర్శించింది.
”పార్లమెంట్ మీది… అందుకే జనంలో ఎన్ని భయాలున్నా మీరు చట్టం చేసుకున్నారు. రాజ్యాంగాన్నిసంరక్షించే కోర్టు మాత్రం కొట్టివేస్తుందని” సభ బయటా, లోపలా అన్నారు కాంగ్రెస్ నేతలు. సోమవారం(డిసెంబర్ 9) పెద్దగా ప్రతిఘటన లేకుండానే లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును నెగ్గించుకుంది బీజేపీ. రాజ్యసభలో అంకెలన్నీ అనుకూలంగా కనిపిస్తున్నా ఏదో జరగబోతోందన్న ఆశ విపక్షానిది. ముస్లింలు భయపడాల్సింది ఏమీ లేదన్న వాదనతో విపక్షాన్ని అమిత్ షా కాచుకున్నా, చర్చలో చాలా అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి.
ప్రభుత్వాన్ని కొంతమేర ఇరుకున పెట్టాయి. అదే ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి బీజేపీ తన సభా వ్యూహాల పదునేంటో చూపించింది. 125 – 99 ఓట్ల తేడాతో బిల్లును ఓకే చేయించుకుంది. పౌరసత్వ సవరణ బిల్లు గురించి బీజేపీలో ఎలాంటి బెంగా లేదు.
సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతిన్నా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీతోనే తన విధానాన్ని బీజేపీ స్పష్టం చేసింది. ముస్లిం శరణార్ధులకు ఈ దేశంలో స్థానం లేదని అధికార పార్టీ చెప్పదలుచుకుంది. ఈ విధానంలో ఒక భాగమే పౌరసత్వ సవరణ బిల్లు.