I-N-D-I-A: మెగా విపక్ష సమావేశం అనంతరం.. ఇండియా (I-N-D-I-A) కూటమి నేతలు ఏమన్నారంటే?

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని ఇక నుంచి ఇండియా అని పిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇంగ్లిష్‌లో ఇండియా, భారత్ అని పిలవొచ్చు అని అన్నారు

I-N-D-I-A: మెగా విపక్ష సమావేశం అనంతరం.. ఇండియా (I-N-D-I-A) కూటమి నేతలు ఏమన్నారంటే?

Updated On : July 18, 2023 / 7:15 PM IST

Opposiotion Parties: విపక్ష పార్టీల కొత్త కూటమి పేరు ఇండియా (I.N.D.I.A) అని ఖరారు చేశారు. ఇండియా అంటే అంటే ‘ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్’ అని అర్థమట. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఐక్య ఫ్రంట్‌ను రూపొందించడానికి రెండు రోజులుగా 26 ప్రతిపక్ష పార్టీలను చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశంలోనే కూటమికి I-N-D-I-A అనే పేరును ఖరారు చేశారు.

ఇక ఈ సమావేశం అనంతరం విపక్ష పార్టీల నేతలు వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే.. అధికార భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీ
ఇండియా అనే భావవపై దాడి జరుగుతోందని, కోట్లాది మంది భారతీయుల నుంచి ఇండియా గొంతును లాక్కొని నరేంద్ర మోదీ సన్నిహితులైన కొంతమంది వ్యాపారులకు అప్పగిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది భారత్ గొంతు కోసం జరుగుతున్న పోరాటమని అన్న ఆయన అందుకే ఇండియా పేరును ఖరారు చేశామని స్పష్టం చేశారు. ఎన్డీయే వర్సెస్ ఇండియా, నరేంద్ర మోదీ వర్సెస్ ఇండియా, ఇండియా వర్సెస్ వాళ్ల ఐడియాలజీ మధ్య పోరాటం ఇదని వర్ణించారు. భారత రాజ్యాంగం, దేశ ప్రజల గొంతు, దేశం అనే గొప్ప భావనపై దాడిని తాము నిలువరిస్తున్నామని అన్నారు. భారత్ అనే భావనకు ఎదురు నిలబడితే ఎవరు గెలుస్తారో మనందరికీ తెలుసతీ రాహుల్ గాంధీ ఎన్డీయే కూటమిని హెచ్చరించారు.

మల్లికార్జున్ ఖర్గే
‘‘ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదు. మా తాపత్రయం అధికారం సాధించడం కోసం అసలే కాదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించేందుకే మా ప్రయత్నం అంతా’’ అని ఖర్గే అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మేము 26 పార్టీల నుంచి ఒక్కటయ్యాము. ఈ కూటమి 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీ తనకు తానుగానే 303 సీట్లు గెలవలేదు. చాలా పార్టీల కూటమి కారణంగా వాళ్లు ఓట్లు, సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు వారి కంటే బలమైన కూటమిని మేము రూపొందించాము’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.

మమతా బెనర్జీ
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని ఇక నుంచి ఇండియా అని పిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇంగ్లిష్‌లో ఇండియా, భారత్ అని పిలవొచ్చు అని అన్నారు. ‘‘ఎన్డీయే.. ఇండియా కూటమిని సవాలు చేయగలవా?’’ అంటూ బీజేపీకి సవాల్ విసిరారు. మాతృభూమిని తాము ప్రేమిస్తామని, ఈ దేశ భక్తులం తామేనని అన్నారు. దేశం కోసం, ప్రపంచం కోసం, రైతుల కోసం, అందరి కోసం ఉన్నామని మమత అన్నారు.

మెహబూబా ముఫ్తీ
‘‘దేశంలో ఏం జరిగినా గర్వపడే సమయం ఇది కాదు. ఎందుకంటే మన దేశం మీద బయటి వ్యక్తులు వేళ్లు చూపిస్తున్నారు. అందుకే ఈ రోజు మన దేశం, అంతర్గతంగానే కాదు, మన ఉనికి కూడా అస్తవ్యస్తంగా మారుతోంది. మన దేశంలోని ప్రతిదీ ప్రమాదంలో ఉంది’’ అని పీడీపీ చీఫ్ మెహబూబా అన్నారు.

ఒమర్ అబ్దుల్లా
‘‘ఇంతకు ముందు ఎన్డీయే అసవరమే లేదని బీజేపీ నేతలు అన్నారు. ఇప్పుడెందుకు ఉన్నపళంగా ఎన్డీయే మీటింగు జరుపుతున్నారు? ‘ఇండియా’ కూటమిని చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే వారికి మళ్లీ కూటమి అవసరం వచ్చింది’’ అని నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ చీఫ్ అబ్దుల్లా అన్నారు.

వైగో
‘‘ఇది చాలా విజయవంతమైన సమావేశం. వచ్చే ఎన్నికల్లో మేం కచ్చితంగా బీజేపీని ఛాలెంజ్ చేస్తాం’’ అని ఎండీఎంకే చీఫ్ వైగో అన్నారు.