విశ్లేషణ : భారత్‌లో లాక్‌డౌన్ లేకుంటే.. ఏప్రిల్ 15లోగా 8.2లక్షల మందికి కరోనా సోకేది!

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుంటే.. వైరస్ సోకిన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ ఎలాంటి వ్యాక్సీన్ లేదు.. పూర్తి స్థాయిలో వ్యాక్సీన్ రావాలంటే మరో ఏడాదన్నర సమయం పడుతుంది. అప్పట్లోగా వైరస్ బారినుంచి ప్రపంచం బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం.. లాక్ డౌన్.. ప్రపంచదేశాల ముందున్న ఏకైక ఆయుధం కూడా ఇదే..
కరోనా నియంత్రణకు ఈ రెండే మార్గాలు :
లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ ఈ రెండు మాత్రమే వైరస్ క్లస్టర్లను నియంత్రించగలవు. వైరస్ ఒకరినుంచి ఇతరులకు సోకకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలైన అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 25న దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ (ఏప్రిల్ 15వరకు) విధించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఇదొక్కటే మార్గమన్నారు.
8.2 లక్షల మందికి వైరస్ సోకేది :
ఒకవేళ.. లాక్ డౌన్ లేకుంటే మాత్రం భారత దేశంలో ఏప్రిల్ 15 నాటికి 8.2 లక్షల మందికి కరోనా వైరస్ వ్యాప్తిచెంది ఉండేదని ఓ విశ్లేషణ వెల్లడించింది. ICMR అధ్యయనం వంటిది ఏది లేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లేదని చెప్పిన మరుసటి రోజునే పెరిగిన కేసుల విశ్లేషణ అంతర్గత గణాంకాల రేటు ఆధారంగా అంచనా వేసినట్టు పేర్కొంది.
ఇందులో లాక్ డౌన్, నియంత్రణ చర్యలు లేకుంటే మాత్రం 41% సంచిత వృద్ధిరేటు ఏప్రిల్ 15 నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 8.2లక్షలకు చేరేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ICMR అధ్యయనంలోని గణాంకాలంటూ వచ్చిన నివేదికలను ఆయన ఖండించారు. లాక్ డౌన్ లేకుండా కేవలం నియంత్రణ చర్యలు చేపడితే ఇలాంటి గణాంకాలు నమోదవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు.
లాక్ డౌన్‌కు ముందు .. 1.2 లక్షల కేసులు :
అదేవిధంగా గణాంకాల విశ్లేషణ ప్రకారం.. లాక్ డౌన్ ప్రారంభానికి ముందే దేశంలో ఏప్రిల్ 15నాటికి గరిష్టంగా 1.2 లక్షల పాజిటివ్ కేసులు 28.9శాతంగా నమోదై ఉండేవని తెలిపింది. ఏప్రిల్ 11 నాటికి కేవలం లాక్ డౌన్ మాత్రమే విధిస్తే.. ఈ కేసులు 2 లక్షలు వరకు చేరి ఉండేవని, నియంత్రణ చర్యలు మాత్రమే తీసుకుంటే 44వేల వరకు పాజిటివ్ కేసులు నమోదై ఉండేవని గణాంకాలు తెలిపాయి.
నియంత్రణ చర్యలు వల్లే కేసులు తగ్గాయి :
ప్రస్తుతం భారతదేశంలో సమర్థవంతంగా లాక్ డౌన్, పకడ్బందీ నియంత్రణ చర్యలు చేపట్టడంతోనే కరోనా వైరస్ పాజిట్ కేసులు అతి తక్కువగా నమోదయ్యాయని, ఇప్పటివరకూ 7,447 (శనివారం నాటికి) పాజిటివ్ కేసులు ఉన్నాయని అగర్వాల్ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన భౌతిక దూరం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందుకే లాక్ డౌన్ మరిన్ని రోజులు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా కేసులు లేని ప్రాంతాల్లో సడలింపుతో లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉంది.