బీహార్ డీజీపీ రాజీనామా…అధికార పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో!

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2020 / 03:13 PM IST
బీహార్ డీజీపీ రాజీనామా…అధికార పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో బీహార్‌ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.

వీఆర్‌ఎస్(voluntary retirement from service)కోరుతూ పాండే పెట్టుకున్న అభ్యర్థనను బీహార్‌ గవర్నర్‌ మంగళవారం సాయంత్రం ఆమోదించారు. ఈ మేరకు దీనికి సంబంధించి హోంశాఖ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. హోంగార్డ్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ సంజీవ్‌ సింఘాల్‌కు డీజీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు.



1987 బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే… బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు గుప్తేశ్వర్ పాండే… బీహార్ ‌ డీపీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఔరంగాబాద్‌, జెహానాబాద్‌, అర్వాల్‌, బెగుసారై, నలంద తదితర నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలో ఎస్పీగా పని చేశారు. ముంగెర్, ముజాఫర్‌పూర్‌ జోన్‌ డీఐజీగా, ఐజీగా, బీహార్‌ పోలీస్‌ శిక్షణ ఐజీగా పని చేశారు.

వాస్తవానికి గుప్తేశ్వర్‌ పాండే… వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేసినట్లు సమాచారం. అయన జేడీయూలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న బిహార్ ‌అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వస్థలం బక్సర్ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా అయన బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం పాండే… బక్సర్ లోని జేడీయూ నాయకులు,కార్యకర్తలతో సమావేశమైనట్లు సమాచారం.


కాగా, పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2009లో రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్‌ పై బక్సర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలను భావించి పాండే… తన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం రాజీనామాను ఆమోదించలేదు.