భారత్ లో దాడులకు పాక్ వ్యూహం

భారత సైనికులపై దాడులు చేయాలని పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుట్రలు పన్నుతోంది. సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పాక్ ఆర్మీ ఇప్పటికే దాదాపు 100కు పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) కమాండోలను మోహరించనట్లు భారత ఆర్మీ గుర్తించింది. దీనికి సంబంధించిన విషయాలను భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో పాక్ ఎస్‌ఎస్‌జీ కమాండోలు చేస్తున్న కార్యకలాపాల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, వారు జైషే, ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే అఫ్గన్‌కు చెందిన 12 మంది జిహాదీలను జేషే సంస్థ లీపా వ్యాలీలోకి దింపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఆ ఉగ్రవాదులు భారత లక్ష్యాలపై దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జేఈఎం అధినేత మసూద్ అజర్ సోదరుడు రవూఫ్ అజర్ ఆగస్టు 19, 20 తేదీల్లో బహవల్‌పూర్‌లో ఉగ్రవాదులతో సమావేశం నిర్వహించారు.
దీంతో ఉగ్రవాదులు భారత్‌లోని ముఖ్య నగరాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు సరిహద్దుల్లో సిద్ధమైనట్లు తెలిపారు. భారత దళాలపై దాడులకు ఆప్ఘన్ ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పాక్ ఏజెన్సీలు చేపట్టాయని, కశ్మీరీ టెర్రరిస్టులును స్థానిక కమాండర్లుగా నియమించడానికి బదులుగా వారి స్థానాల్లో ఆప్ఘన్ టెర్రిరిస్టులను నియమించే ప్రక్రియ కూడా చురుగ్గా జరుగుతోందని ఇండియన్ ఆర్మీ కనిపెట్టింది.