పాక్ షూటర్లకు వీసాలిచ్చి అనుమతించిన భారత్‌

పాక్ షూటర్లకు వీసాలిచ్చి అనుమతించిన భారత్‌

భిన్నత్వంలో ఏకత్వం. శత్రు దేశమైనా ప్రేమగా దగ్గర తీసుకునే మనస్తత్వం భారతీయులది. అందుకే భారత్ విషయంలో ఏ ఆపద వచ్చినా ప్రపంచ దేశాలన్నీ కదలివస్తాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో 40మంది జవాన్ల ప్రాణాలను కోల్పోయినా ఆ దేశంపై సహాయనిరాకరణకు దిగిందే తప్ప.. ఆవేశపడలేదు. అంతేకాదు, ఆ దేశ ప్లేయర్లను మనదేశంలో ఆడేందుకు కూడా అనుమతిచ్చింది. 

ఢిల్లీ వేదికగా జరగనున్న షూటింగ్ వరల్డ్ కప్ 2019కు పాకిస్తాన్ ప్లేయర్‌కు అనుమతిస్తూ వీసా జారీ చేసింది భారత ప్రభుత్వం. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2019కు పాకిస్తాన్‌ నుంచి ఇద్దరు షూటింగ్ క్రీడాకారులు, ఒక కోచ్ రావాల్సి ఉంది. వారి అనుమతుల కోసం భారత్‌లోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ)ను సంప్రదించారట. వారి అభ్యర్థనను హై కమిషన్‌కు పంపడంతో వారు కూడా ఆమోదం తెలిపారట. 

షూటింగ్ వరల్డ్ కప్ ఈవెంట్ ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ రేంజ్ షూటింగ్ ప్రాంతంలో జరగనుంది. 2019లో ఇది తొలి issf world cup. ఇందులో గెలిచిన వారికి టోక్యోలో జరగనున్న 2020 ఒలింపిక్స్‌కు అర్హత దక్కుతుంది. ఈ పోటీకి భారత్ 23 మంది జట్టుతో బరిలోకి దిగనుంది. వీరిలో 11మంది షూటర్లు కాగా, తక్కువ అర్హత స్కోరుతో పోటీలో దిగనున్నారు.