కరోనా వ్యాక్సిన్ తొలి ప్రాధాన్యం వారికే – ఒడిశా సీఎం

covid vaccine odisha : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఆరోగ్య కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, 65 ఏళ్లు పైబడిన వారికి తొలుత ప్రాధాన్యత కల్పిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం కరోనా పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. అలాగే..ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు.
కోవిడ్ – 19 సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, అమెరికా, పశ్చిమ ఐరోపా, ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో..ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చిందన్నారు. శీతాకాలంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఆసుపత్రుల్లో ఐసీయూలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనాను నియంత్రించగలిగామని, రోగ నిరోధకత పెంపెందించుకోవాలన్నారు.
ఒడిశా రాష్ట్రంలో 3 లక్షల 10 వేల 920 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. 1560 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 8 వేల 818 యాక్టివ్ కేసులుండగా..ఇప్పటి వరకు 3 లక్షల 474 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.